అన్ని పాఠశాలలకు డిజిటల్ బోర్డులు కేంద్ర విద్యా సలహా మండలి
దిల్లీ: దిల్లీలో కేంద్ర విద్యా సలహా మండలి సమావేశం జరిగింది. దేశంలో విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా జరిగిన ఈ భేటీలో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఐదేళ్లలో దేశంలోని అన్ని పాఠశాలలకు డిజిటల్ బోర్డులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంఘాలతో కలిసి ఈ డిజిటల్ బోర్డులు ఏర్పాటుచేయనున్నారు. క్రియాశీలక చర్యలు, ప్రణాళికలతో నాణ్యమైన విద్య అందరికీ అందించడం, స్వచ్ఛభారత్, ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్, సుగమ్య భారత్ వంటి కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం, మానవ విలువలు, జీవన నైపుణ్యాలు అందించే విద్యను ప్రోత్సహించడం ప్రధాన ధ్యేయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రకాశ్ జావడేకర్ , మేనకా గాంధీ, తవార్ చంద్ గెహ్లాట్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజ్యవర్దన్‌సింగ్ రాఠోడ్, సత్యపాల్ సింగ్, వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ మంత్రులు పాల్గొన్నారు.