Type Here to Get Search Results !

5 లక్షలిస్తే జీవో -నాలుగేళ్ల బీఏ, బీఎస్సీ బీఈడీ కోర్సు

5 లక్షలిస్తే జీవో

నాలుగేళ్ల బీఏ, బీఎస్సీ బీఈడీ కోర్సుల మాటున వసూళ్ల పర్వం*
అటానమస్‌, నాక్‌ అక్రెడిటేషన్‌ డిగ్రీ కాలేజీలకే అనుమతి ఇస్తామని..*
*♦ఆ మాట మరిచి ప్రైవేట్‌ బీఎడ్‌ కాలేజీలకు పర్మిషన్‌ ఇస్తూ ఉత్తర్వులు*

🌻నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సుల నిర్వహణకు గాను అనుమతులు ఇప్పిస్తామంటూ ఓ గ్యాంగ్‌ వసూళ్ల పర్వానికి దిగింది. ఈ కోర్సులు నిర్వహించాలనుకునే వారు తమకు రూ.5 లక్షలిస్తే జీవో ఇప్పిస్తామంటూ బీఈడీ కాలేజీల మేనేజ్‌మెంట్లకు వల వేస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌ డిగ్రీ, బీఈడీ కాలేజీల నిర్వాహకులే ఈ రాకెట్‌ నడుపుతున్నట్లు తెలుస్తోంది.

🌻 ఇప్పటికే కొన్ని బీఈడీ కాలేజీల మేనేజ్‌మెంట్ల నుంచి కొంత మొత్తం వసూలు చేసినట్లు సమాచారం. వీరికి ఉన్నత విద్యాశాఖలోని కొందరు సిబ్బంది కూడా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

🌻రాష్ట్రంలో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులను నిర్వహించుకునేందుకు ఆరు ప్రైవేట్‌ బీఈడీ కాలేజీలకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా కాలేజీలకు తామే అనుమతులు ఇప్పించామంటూ సదరు గ్యాంగ్‌ ఇతర కాలేజీల మేనేజ్‌మెంట్లను నమ్మిస్తోంది. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సుల అంశం కొన్ని సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది. ఇప్పటివరకు రీజినల్‌ బీఈడీ కాలేజీల్లోనే ఈ కోర్సు నడుస్తోంది. అయితే రాష్ట్రంలోనూ ఈ కోర్సును నిర్వహించుకునేందుకు 33 కాలేజీలకు ఎన్‌సీటీఈ 2015-16 విద్యా సంవత్సరంలోనే అనుమతిచ్చింది. కానీ ఇంతవరకు అమలు కాలేదు. రాష్ట్రంలో ఈ కోర్సుకు సంబంధించిన సిలబస్‌ రూపకల్పనకు ఉన్నత విద్యామండలి ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ డ్రాఫ్ట్‌ సిలబ్‌సను రూపొందించినా ఇప్పటి వరకు దానికి అనుమతి రాలేదు.

🌻ఫలితంగా ఈ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ కోర్సు ఎలా నిర్వహించాలన్న దానిపై గతంలో పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. అటానమస్‌ డిగ్రీ కాలేజీలకు, నాక్‌ అక్రెడిటేషన్‌ కలిగిన డిగ్రీ కాలేజీలకు మాత్రమే ఈ కోర్సుల నిర్వహణకు అనుమతివ్వాలని అప్పట్లో నిర్ణయించారు. రాష్ట్రంలో మూడేళ్ల డిగ్రీ కోర్సును సీబీసీఎస్‌ విధానంలో నిర్వహిస్తుండటం, డిగ్రీ కాలేజీల్లో మాత్రమే మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌లు ఉన్నందున ఈ అభిప్రాయానికొచ్చారు. ఐదు సంవత్సరాలు చదవాల్సిన డిగ్రీ, బీఈడీ చదువును నాలుగేళ్లకు కుదించాల్సి రావడంతో సిలబస్‌ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని గుర్తించారు. కానీ ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ ఆ విషయాన్ని విస్మరించినట్లు కనిపిస్తోంది.

🌻ఎలాంటి అధ్యయనం లేకుండా, మౌలిక సదుపాయాలు సరిచూసుకోకుండా ఏకంగా ప్రైవేట్‌ బీఈడీ కాలేజీలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. సిలబస్‌ లేకుండా.. బీఎడ్‌ కాలేజీల్లో ల్యాబ్స్‌, మౌలిక సదుపాయాలు లేకుండా వర్సిటీలు ఆయా కాలేజీలకు అఫిలియేషన్‌ ఎలా ఇస్తాయన్న దానిపై స్పష్టత లేదు. 2018-19 విద్యా సంవత్సరంలో ఆయా కోర్సులను ఎలా నిర్వహిస్తారో తెలియని పరిస్థితి. తాజా ఉత్తర్వులపై అయోమయం నెలకొంది. ఇప్పటికైనా ఈ కోర్సుల నిర్వహణపై ఉన్నత విద్యా శాఖ స్పష్టమైన నిర్ణయం తీసుకుకోవాల్సిన అవసరం ఉంది.
Tags