Type Here to Get Search Results !

రాష్ట్రంలో రెండు కొత్త విశ్వవిద్యాలయాలు

 రాష్ట్రంలో రెండు కొత్త విశ్వవిద్యాలయాలు

ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఏర్పాటు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నిమిట్టలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ విశ్వవిద్యాలయంలోనే రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఉపయోగపడేలా అధ్యయన, పర్యావరణాలు, సామర్థ్య నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి విజయనగరం జిల్లాలో జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)-గురజాడ, విజయనగరం(జేవీ) ఏర్పాటు చేయనున్నారు. ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జేఎన్‌టీయూ-కాకినాడకు అనుబంధంగా 8 జిల్లాల్లో 238 కళాశాలలున్నాయి. ప్రతిపాదిత విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని అనుబంధ కళాశాలలను ప్రతిపాదిత విశ్వవిద్యాలయం ద్వారా పర్యవేక్షణ చేయడంతోపాటు నియంత్రణను మెరుగుపరచవచ్చని ప్రభుత్వం తెలిపింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా విశ్వవిద్యాలయాన్ని స్థాపించనున్నట్లు పేర్కొంది. ఈ రెండింటితో పాటు రాష్ట్ర విద్యాసంస్థలు (ఉపాధ్యాయ కేడర్‌లో రిజర్వేషన్లు), ఆంధ్రప్రదేశ్‌ సినిమా (క్రమబద్ధీకరణ), వాహనాల పన్ను (సవరణ) బిల్లులను రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ భూముల (వ్యవసాయేతర భూములుగా మార్పిడి) సవరణ బిల్లును ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సభలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది.