ఓటర్ ఐడీతో ఆధార్ లింక్
ఎన్నికల సంఘం చాలాకాలంగా ఈ సంస్కరణలను ప్రతిపాదిస్తూ వస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాన్‌తో ఆధార్ కార్డును లింకు చేసినట్లే ఓటర్ కార్డును కూడా ఆధార్‌తో లింక్ చేయాలని ఈసీ ప్రతిపాదించిందని గత మార్చిలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ లోక్‌సభకు చెప్పారు. ఓటర్లు అనేక ప్రాంతాల్లో ఎన్‌రోల్ చేయించుకోవడాన్ని నిరోధించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందన్నారు. ఇందుకోసం ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. గతంలో ఈసీ ఆధార్ నెంబర్ల సేకరణ ఆరంభించగా 2015లో సుప్రీంకోర్టు అడ్డుపడింది. చట్ట సవరణ లేకుండా ఆధార్ నెంబర్లను ఈసీ స్వీకరించకూడదని తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓటును స్వచ్ఛందంగా ఆధార్‌తో లింక్ చేసుకునే సవరణను ప్రభుత్వం ఈ బిల్లులో తీసుకువచ్చింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు ఏ ప్రాంగణానైన్నా ఈసీ తాత్కాలికంగా స్వాధీనం చేసుకునే వీలు కల్పించే అంశాన్ని కూడా బిల్లులో పొందుపరిచారు.
ఏడాదికి నాలుగుమార్లు కొత్త ఓటర్లకు ఓటు నమోదు అవకాశం-కొత్త కటాఫ్ డేట్లు
ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేయించుకునేవారికి ఏటా నాలుగుమార్లు అవకాశం కల్పించే ప్రతిపాదనను కేంద్రం కొత్త బిల్లులో చేర్చింది. ఇంతవరకు ఒక సంవత్సరం జరిగే ఎన్నికకు ఆ ఏడాది జనవరి 1కి 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే కొత్త ఓటరు నమోదు అవకాశం ఇస్తున్నారు. అంటే జనవరి 2 తర్వాత 18 ఏళ్లు నిండిన యువత వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఓటర్‌గా నమోదు చేయించుకునే వీలుండేది కాదు. దీనివల్ల యువతలో చాలామందికి కొత్తగా ఓటర్ అయ్యే అవకాశం ఏడాది కాలం పాటు మిస్సవుతోందని ఎన్నికల సంఘం కేంద్రం దృష్టికి తెచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రాతినిధ్య చట్టం 14–బి నిబంధనకు సవరణ తెస్తూ నాలుగు కటాఫ్ డేట్ల(జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) సంస్కరణను బిల్లులో పొందుపరిచారు. అంటే ఈ డేట్లకు 18 ఏళ్లు నిండినవారు కొత్తగా ఓటర్ల జాబితాలోకెక్కవచ్చు. అలాగే ఇంతవరకు సర్వీసు ఓటర్లకు(సైన్యంలో పనిచేసేవారు) ఇబ్బందిగా మారిన ఒక అంశాన్ని సవరిస్తూ బిల్లులో సవరణను ప్రతిపాదించారు. ఇప్పటివరకు సర్వీసులో ఉన్న పురుషుడి భార్య సర్వీసు ఓటరుగా నమోదు చేసుకొనే వీలుంది. కానీ సైన్యంలోని మహిళ భర్తను సర్వీసు ఓటరు గుర్తించేవారు కాదు. ఇకపై వీరికి కూడా సర్వీసు ఓటరు గుర్తింపు కల్పించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఇందుకోసం భార్య అనే కాలమ్‌ను తొలగించి జీవిత భాగస్వామి(స్పౌజ్) అనే కాలమ్‌ను పొందుపరచాలని నిర్ణయించారు.