విద్యాలయాల్లో కొవిడ్ భయం
*🌻పేరూరు (ముదినేపల్లి),న్యూస్‌టుడే:* పాఠశాలలను కొవిడ్ భయం వెంటాడుతోంది. పలు విద్యాలయాల్లో విద్యార్థులు, మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులు జలుబు, జ్వరాలతో బాధపడుతుండటంతో మిగిలిన వారు భయాందోళన చెందుతున్నారు. మండలంలోని పేరూరు శివారు తేరగూడెం పాఠశాలకు పూర్తిస్థాయి ఉపాధ్యాయుడు లేకపోవటంతో మిగతాచోట్ల నుంచి రోజుకొకరు చొప్పున డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులను పంపిస్తున్నారు. శుక్రవారం పాఠశాలకు వచ్చిన దాకరం పాఠశాల ఉపాధ్యాయిని ఆశా జలుబుతో బాధపడుతుండడంతో విద్యార్థులందరినీ దూరంగా కూర్చోమని చెప్పారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు వచ్చి, ఆమెను ప్రశ్నించారు. రాత్రి తొమ్మిది గంటలకు డిప్యుటేషన్ తెలిపారని, తప్పని పరిస్థితిలో అస్వస్థతగా ఉన్నా బడికి వచ్చానని తెలిపారు. అందుకే పిల్లలను దూరంగా కూర్చోమన్నానని, ఎవరినీ తన వద్దకు రావద్దని తెలిపానని వివరించారు. ఇలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితిని మండల విద్యాశాఖాధికారి దృష్టికి గ్రామస్థులు తీసుకువెళ్లారు. ప్రతి విద్యార్థికి దగ్గర ఉండి మాస్క్ పెట్టించారు.
*♦ప్రభుత్వ కార్యాలయాల్లో కలవరం*
కైకలూరు: మండల ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులను కరోనా మహమ్మరి కలవరపెడుతోంది. తహసీల్దార్ వై.రంగారావు కరోనా బారిన పడగా రెవెన్యూ ఉద్యోగ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు తహసీల్దార్‌తో సన్నిహితంగా మెలిగిన వారందరూ శుక్రవారం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ తరుణంలోనే కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఏడుగురు ఉద్యోగులకు సైతం కరోనా సోకింది. దీంతో ఆసుపత్రిలోని రోగులు, బాలింతలు, వారి బంధువులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు