16 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
🌻విశాఖపట్నం, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఎంబీఏ/ఎంసీఏల్లో ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అయితే, ఐసెట్ రాసి ఎంబీఏలో చేరేందుకు సిద్ధమవుతున్న పలువురు ఇంజనీరింగ్ అభ్యర్థులు ఇప్పటి వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.🌻2017-18 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి ఆయా కళాశాలలు ధ్రువపత్రాలు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కానందున ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేమని కళాశాలలు స్పష్టం చేస్తున్నాయి.
'పది' విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
*♦విషయ నిపుణులతో డీఈవో సమీక్ష*🌻చిత్తూరు(విద్య), న్యూస్‌టుడే: పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా విద్యాశాఖాధికారి పాండురంగస్వామి విషయ నిపుణులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పదోతరగతి సబ్జెక్టు విషయ నిపుణులతో ప్రత్యేక ప్రణాళిక రూపకల్పనపై ఆయన బుధవారం చర్చించారు.
🌻పదో తరగతిలో వెనకబడిన విద్యార్థులకు రెమిడియల్ బోధన ఇప్పటినుంచే ఇవ్వాలని స్పష్టం చేశారు. సంక్షిప్త ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలపై శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
🌻గణితం, భౌతికశాస్త్రం, ఆంగ్ల సబ్జెక్టులపై ఉపాధ్యాయులకు ఆగస్టు 15లోగా జిల్లాలోని వివిధ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో విషయ నిపుణులకు మహా సంకల్పాన్ని రూపొందించడంలో శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. ఇందుకు సబ్జెక్టు వారీగా విషయ నిపుణులను ఎంపిక చేయాలని ఆయన ఆదేశించారు. చిత్తూరు డీవైఈవో విజయేంద్రరావు, డీసీఈబీ కార్యదర్శి దామోదర నాయుడు, విషయ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
మొక్కల పండగకు వేళాయె
*♦ఈ నెల 14 నుంచి 'వనం-మనం' ప్రారంభం**♦కార్తీక వనసమారాధన వరకూ నిర్వహణ*
*♦రాష్ట్ర వ్యాప్తంగా 26 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం*
*♦నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రారంభించనున్న చంద్రబాబు*
🌻ఆంధ్రప్రదేశ్‌లో మొక్కల పండగకు వేళయింది. తొలకరి జల్లుల వేళ 'వనం-మనం' కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది.
🌻ఈ నెల 14 నుంచి నవంబరు మాసంలో జరిగే కార్తీక వనసమారాధన వరకూ ప్రతి రోజూ దీన్ని మహోద్యమంలా చేపట్టాలని నిర్ణయించింది. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.
🌻 జిల్లాల్లో మంత్రులు నిర్వహిస్తారు. మొత్తం అయిదు నెలల వ్యవధిలో 26 కోట్ల మొక్కలను నాటాలన్నది లక్ష్యం.
🌻ప్రారంభం రోజునే రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటనున్నారు. దీనికి సంబంధించి మొత్తం 22 ప్రభుత్వ విభాగాలకు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సంక్షేమ వసతి గృహాలు, కళాశాలలు, పాఠశాలలు, దేవాలయాలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు, రహదారులకు ఇరువైపులా నాటనున్నారు.
🌻 పాఠశాల, కళాశాలల విద్యార్థులు, స్వయం శక్తి సంఘాల మహిళలు, రైతులు, వనమిత్ర బృందాలు, వనసంరక్షణ సమితి, వాటర్‌షెడ్ సభ్యులను వనం-మనంలో భాగస్వాముల్ని చేయనున్నారు.
🌻నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు 5 వేల మంది విద్యార్థులు పాల్గొంటారు. అంతకంటే ముందు వాటి పరిరక్షణకు సంబంధించిన కార్యాచరణ కూడా ఖరారు చేయనున్నారు. దీని నిర్వహణ, రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం వెలగపూడి సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. విధివిధానాలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయాలని సూచించారు.
అంగన్‌వాడీలను ప్రభుత్వోద్యోగులుగా.. గుర్తించాల్సిందే
- కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయించాలి- ఐసిడిఎస్‌ను పరిరక్షించాలి
- ముగిసిన 36 గంటల అంగన్‌వాడీల మహాధర్నా
ఐసీడీఎస్‌ను పరిరక్షించాలని, అంగన్‌వాడీలను ప్రభు త్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన 36 గంటల మహాధర్నా బుధవారం ముగిసింది. కార్యకర్త లకు కనీస వేతనం రూ.18వేలివ్వాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జ యలక్ష్మి డిమాండ్ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నాలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో మాతాశిశుమరణా లు, పోషకాహార లోపాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఐసీడీఎస్ ఏర్పడిందని చెప్పారు. కానీ ఐసీడీఎస్‌లో నగదు బదిలీ అ మలు చేస్తే గ్రామాల్లో పేద ప్రజలు సరుకులు కొనుక్కొని వంట చేసుకుని తినే పరిస్థితి ఉండదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారానే పోషకాహారాన్ని సరఫరా చేయాలని, అం దుకు ఐసీడీఎస్‌ను కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలని డి మాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట వర్షంలో గొ డుగులు పట్టుకొని ధర్నా చేశారు. నిర్మల్ కలెక్టరేట్, ఆసిఫాబాద్ ఐడిడిఎస్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది.
మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీల ధర్నాలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర నాయకుడు బి.మధు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఐటీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు మాట్లాడుతూ.. ఈ మహాధర్నాతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తీరును మార్చుకొని ఐసీడీఎస్‌ను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్‌లో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పాల్గొన్నారు. మహబూ బాబాద్ జిల్లా కేంద్రంలోని సీడీపీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. యాదాద్రి కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం డీఆర్‌వో మహేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి జిల్ల్లా కొత్తగూడెంలో జరిగిన ధర్నా వద్దకు వచ్చిన సీడీపీఓ సంక్షేమాధికారి ఝాన్సీలక్ష్మీభాయికు వినతిపత్రం అందజేశారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, మిగతా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు
ఉగ్రవాదులం కాదు..ఉపాధ్యాయులం
బుధవారం విజయవాడ గాంధీనగర్ ధర్నాచౌక్ వద్ద జరిగిన మహాధర్నాలో పాల్గొన్న ఉపాధ్యాయులుతాము విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులమే కానీ విధ్వంసం సృష్టించే ఉగ్రవాదులం కాదంటూ టీడీపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు సకాలంలో అందజేయాలన్న డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధ్యాయులు బుధవారం విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి దాదాపు 2,000 మంది ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, బొడ్డు నాగేశ్వరరావుతోపాటు అన్ని విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉపాధ్యాయులు నగరంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ధర్నా చౌక్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రసంగించారు. డిమాండ్ల సాధన కోసం శాంతియుత ర్యాలీ, ధర్నాకు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. ఏ తప్పు చేశామని అర్ధరాత్రి అరెస్ట్‌లు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాలల్లోకి పోలీసులు ప్రవేశించి ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకోవడం దారుణమని మండిపడ్డారు.
ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి
ప్రభుత్వం తమ మనోభావాలను దెబ్బతీసిందని, వెంటనే క్షమాపణ చెప్పి రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా నిర్బంధించిన వారందరినీ విడుదల చేయాలని ఫ్యాప్టో చైర్మన్ పి.బాబురెడ్డి డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసే హక్కు తమకుందని, దాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఈ నెల 17వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని తేల్చిచెప్పారు.
టీడీపీకి ఒక న్యాయం.. మాకో న్యాయమా?
అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ధర్మపోరాట దీక్షల పేరుతో రూ.కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి ధర్నాలు చేస్తే తప్పు కానప్పుడు తాము శాంతియుతంగా నిరసన తెలపడం తప్పెలా అవుతుందని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకో న్యాయం, తమకో న్యాయమా అని ప్రశ్నించారు. గతంలో ఉపాధ్యాయులతో పెట్టుకున్నందుకు టీడీపీని అధికారానికి దూరంగా ఉంచామని, మరోసారి అందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. టీచర్లతో పెట్టుకుంటే అధికారానికి దూరం కావాల్సిందేనని సీఎం చంద్రబాబే గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేశారు.
ప్రభుత్వం దిగివచ్చే దాకా పోరాడుతాం
ఉపాధ్యాయుల పోరాటాన్ని అణచి వేయాలనే ప్రభుత్వం ప్రయత్నించడం తగదని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ... ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు.
చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ బాబురావు ఉపాధ్యాయులను ప్రభుత్వం తరపున చర్చలకు ఆహ్వానించడానికి ధర్నా చౌక్‌కు వచ్చారు. ఫ్యాప్టో తరపున ప్రతినిధులు తమతో వస్తే విద్యాశాఖ కమిషనర్‌తో డిమాండ్లు చెప్పుకోవచ్చన్నారు. సంఘం తరపున 12 మంది సభ్యులు సచివాలయానికి వెళ్లారు.
13న ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చలు
ప్రభుత్వ టీచర్లు, విద్యారంగ సమస్యలపై ఈ నెల 13న ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్ ఎమ్మెల్సీలతో ప్రభుత్వం చర్చించనుంది. విజయవాడలో ధర్నా అనంతరం నేతలు, టీచర్ ఎమ్మెల్సీలతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి) ఆదిత్యనాథ్ దాస్ వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని తన చాంబర్లో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు, ఫ్యాప్టో నేతలు బాబురెడ్డి, హృదయరాజు, నాగేశ్వరరావు, పాండురంగ వరప్రసాద్, పి.కృష్ణయ్య, జీవీ నారాయణరెడ్డి, రవిచంద్రకుమార్, సుధీర్, కరీముల్లా రావు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్, పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్, పదోన్నతుల కల్పన వంటి ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఈ నెల 13న సీఎంఓలో చర్చలకు రావాలని ఆదిత్యనాథ్ దాస్ సూచించారు. నియోజకవర్గానికి ఒక డిప్యూటీ డీఈఓ పోస్టును ఏర్పాటు చేయడంపైనా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అంతర్ జిల్లా బదిలీలకు సంబంధించి త్వరలోనే జీఓ జారీ చేస్తామని తెలిపారు.
1,200 మంది అరెస్టు
టీచర్లు చేపట్టకుండా మంగళవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నేతలను ప్రభుత్వం అరెస్టు చేయించింది. అరెస్టయిన వారిపై ఎలాంటి కేసులు పెట్టకుండా విడుదల చేయాలని నేతలు కోరారు. ఆదిత్యనాథ్ దాస్ డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1,200 మంది టీచర్లను అరెస్టు చేశారని, అనధికారికంగా 5,000 మందిని అదుపులోకి తీసుకున్నారని నేతలు తెలిపారు.