Type Here to Get Search Results !

13/7/18 ముఖ్య విద్యా విషయక సమాచారం

త్వరలోనే నిరుద్యోగ భృతి అమలు చేస్తాం: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాలన చేపట్టి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతిలో తెలుగుదేశం కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏడాదిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు మార్గనిర్దేశం చేశారు. త్వరలోనే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని అన్నారు.‘‘ 50 లక్షల మందికి నెలకు రూ.1000 చొప్పున పింఛను ఇస్తున్నాం. కేంద్రం తీసేసినా 250 కోట్లతో రేషన్‌ దుకాణాల్లో చక్కెర పంపిణీ చేస్తున్నాం. ప్రజల్లో సంతృప్తి పెరగాలని పని చేస్తున్నాం. ప్రమాదాల్లో చనిపోతే బీమా కింద రూ.5లక్షలు, సాధారణ మరణమైతే రూ.2 లక్షలు ఇస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు. పెళ్లి కానుక కింద ఇవ్వాల్సిన నిధులు పూర్తిగా చెల్లిస్తామనీ, ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని తెలిపారు.
👉‘‘ఒకేసారి మూడు లక్షల గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించాం. రాబోయే నెలలో అర్బన్‌ హౌసింగ్‌ కింద 50 వేల గృహప్రవేశాలు చేస్తాం. పోలవరం పనులు 56.34 శాతం పూర్తయ్యాయి. పోలవరానికి మనం ఖర్చు చేసిన దాంట్లో రూ.2,250 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.

రీయింబర్స్‌’లో 204 శస్త్ర చికిత్సల తొలగింపు

హెల్త్‌ స్కీంలోనే అవకాశం
ప్రభుత్వ ఉద్యోగులకు అందించే మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ నుంచి 204 శస్త్ర చికిత్సలను ఆరోగ్యశాఖ తొలగించింది. వీటిని కేవలం ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌లో మాత్రమే చేయించుకోవాలంటూ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు

ఐఎంయూలో పీహెచ్‌డీ అడ్మిషన్లు

మల్కాపురం, జూలై 12: ఇండియన్‌ మారీటైమ్‌ యూనివర్సిటీ విశాఖ క్యాంపస్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ నెల 31లోగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు క్యాంపస్‌ డైరెక్టర్‌ రామలింగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ కార్యవర్గ సమావేశాలు

అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జాతీయ కార్యవర్గ సమావేశాలను ఈ నెల 14, 15 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్నట్లు ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. ఈ సమావేశాలకు 22 రాష్ట్రాల నుంచి 17 మంది మహిళా ప్రతినిధులు సహా వంద మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో 15ఏళ్ల క్రితం హైదరాబాద్‌ ఈ సమావేశాలు నిర్వహించామన్నారు. సీపీఎస్‌ రద్దుకోసం కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

రాష్ట్రంలో ఇక రెండంచెల విద్యావ్యవస్థ - వర్సిటీల్లో ‘జ్ఞానధార

18న అంబేద్కర్‌ వర్సిటీలో ప్రారంభం
రాష్ట్రంలో ఇక రెండంచెల విద్యావ్యవస్థ
వీసీల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న మహత్తర ప్రణాళికకు విశ్వవిద్యాలయాల నుంచి తక్షణ కార్యాచరణను ఆరంభిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ముఖ్య భూమిక తీసుకోవాలని రాష్ట్రంలోని 17 వర్సిటీల ఉప కులపతులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మూడంచెలుగా ఉన్న ఉన్నత, మాధ్యమిక, ప్రాథమిక విద్యా వ్యవస్థను త్వరలోనే రెండంచెల వ్యవస్థగా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇంటర్మీడియెట్‌ విద్యను త్వరలోనే పాఠశాల విద్యలో మిళితం చేయనున్నామని చెప్పారు. గురువారం విజయవాడ క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన వీసీల సమావేశంలో సీఎం మాట్లాడారు.
ప్రపంచశ్రేణి విద్యా ప్రమాణాలను నెలకొల్పడం, నిరంతర విద్యకు ప్రాధాన్యం, సాంకేతిక అనుసంధానం, నైపుణ్యాభివృద్ధి, నవ్యావిష్కరణలు, స్టార్ట్‌పలకు ప్రోత్సాహం వంటి లక్ష్యాలతో ఈనెల మూడో వారం నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమానికి ‘జ్ఞానధార’ అని పేరు పెట్టాలని భావిస్తున్నామని వివరించారు. విద్య, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో యువతరానికి మార్గదర్శకంగా నిలిచిన పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించి, వారినుంచి ప్రేరణ పొందేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావుకు సూచించారు. కార్యక్రమ నిర్వహణ, సమన్వయ బాధ్యతలు కలెక్టర్లకు అప్పగిస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్యామండలి, ఆయా వర్సిటీలే దీనికి అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని ఆయన నిర్దేశించారు.
ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రెండు, మూడు రోజుల్లో ఆవిష్కరిస్తామని, ఈవెంట్‌ రిజిస్ట్రేషన్లన్నీ దానిద్వారానే జరుగుతాయని సీఎంకు అధికారులు వివరించారు. ఈనెల 18న శ్రీకాకుళంలోని డాక్టర్‌ అంబేద్కర్‌ వర్సిటీ నుంచి ఈవెంట్‌ ప్రారంభమవుతుందని, ఆగస్టు 2న విజయనగరం జేఎన్‌టీయూ, 17న ఏయూ, ఆగస్టు 31న పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్‌ హార్టికల్చర్‌ వర్సిటీ, సెప్టెంబరు 14న రాజమహేంద్రవరంలోని నన్నయ్య వర్సిటీ, 30న మచిలీపట్నం కృష్ణా వర్సిటీ, విజయవాడ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలకు కలిపి, అక్టోబరు 12న గుంటూరు నాగార్జున, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీలకు కలిపి నిర్వహిస్తామని పేర్కొన్నారు.

వీసీలు చొరవ చూపాలి
నాలుగేళ్ల కళాశాల చదువు, 40ఏళ్ల కెరీర్‌కు ఏ విధంగా ఉపకరిస్తుందో మేధోమధనం చేసి ప్రభుత్వానికి తగు సూచనలు ఇవ్వాలని వీసీలను సీఎం కోరారు. ఏపీని వైజ్ఞానిక కేంద్రంగా రూపొందించే కృషిలో భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. వాస్తవానికి ఐఐటీ, నిట్‌ వంటి అఖిల భారత స్థాయి పోటీ పరీక్షల్లో ఏపీ విద్యార్థులు అగ్రస్థానాల్లో నిలిచారని, సాధించిన విజయాలను సగర్వంగా చాటుకోవడం ద్వారా మరింత మందిలో సానుకూల దృక్ఫథం పెరుగుతుందన్నారు.
వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటీవల ఐఏఎస్‌, ఎంసెట్‌, ఐఐటీలకు ఎంపికైన వారిసంఖ్య ఎక్కువగా ఉండటం విశేషమన్నారు. వివిధ అంచెలలో నడుస్తున్న విద్యా సంస్థలన్నింటినీ ఒకదానికొకటి అనుసంధానించేలా మార్పులు తీసుకొస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దిగువ స్థాయిలో అనుసంధానం అయిన వాటికి ఎగువ స్థాయిలో ఉన్నవారు మార్గదర్శనం చేయగలుగుతారని అభిప్రాయపడ్డారు. వర్సిటీలను అత్యుత్తమ చదువులకు నెలవుగా తీర్చిదిద్దాలని కోరారు. సాంకేతికతను, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే కోర్సులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు.

చై-నా’కు దొడ్డిదారిన 300 ర్యాంకులు?

నాలుగేళ్లు నడిచిన బాగోతం..
ఎంసెట్‌-2 లీకేజీ కేసులో వెల్లడి
విద్యార్థులను ప్రశ్నించనున్న సీఐడీ
ఉగ్రవాదుల తరహాలో లీకేజీ నెట్‌వర్క్‌
ఏజెంట్లకు ప్రత్యేకంగా సిమ్‌ కార్డులు!
బిహార్‌ నుంచి ఫోన్లలో ఆదేశాలు
పదేళ్లుగా పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్‌
ఎక్కడా చిక్కని ఎస్బీ సింగ్‌ ముఠా
తెలంగాణలో మాత్రం భంగపాటు
నాడు వరుస కథనాలతో లీక్‌ను బట్టబయలు చేసిన ‘ఆంధ్రజ్యోతి’
 ఒకటి... ఒకటి... ఒకటి... రెండు... రెండు... రెండు... మూడు... మూడు.. మూడు.. ఎంసెట్‌ ఫలితాలు రాగానే టీవీ చానెళ్లలో కనిపించే కార్పొరేట్‌ కళాశాలల ప్రకటనల హోరు వెనుక అసలు మర్మం వెలుగులోకి వస్తోంది. 2016 ఎంసెట్‌-2 లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీకి అంతకుముందు మూడేళ్ల ఎంసెట్‌లూ లీకయినట్లు ఆధారాలు దొరికాయి. అందులో ప్రధాన లబ్ధిదారులు చైతన్య, నారాయణ కళాశాలలేనని నిర్ధారణకు వచ్చారు. 2016 ఎంసెట్‌-2లో దొడ్డిదారిన ర్యాంకులు పొందిన వంద మందిలో 75 మంది చైతన్య, 15 మంది నారాయణ కళాశాల విద్యార్థులున్నారు. అంతకుముందు మూడు ఎంసెట్లలో కలుపుకొని రెండు కళాశాలల నుంచి 300 మంది లబ్ధి పొందినట్లు సీఐడీ అంచనాకు వచ్చింది. నాగోల్‌లోని ఒక కార్పొరేట్‌ కాలేజీ బ్రాంచీ నుంచి అత్యధికంగా ర్యాంకులు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఆ 300 మంది విద్యార్థులకు సంబంధించిన జాబితాను సీఐడీ సిద్ధం చేస్తోంది. వారందరినీ ప్రశ్నించనున్నారు. కార్పొరేట్‌ కాలేజీల ర్యాంకుల బాగోతం వెనక శ్రీచైతన్య డీన్‌ వాసుబాబు, మధ్యవర్తి వెంకట శివనారాయణ, మెడికో గణేశ్‌ ప్రసాద్‌ హస్తం ఉన్నట్లు దర్యాప్తు తేలింది. వారిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే కీలక సమాచారం రాబట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. రెండు వారాల్లో చార్జీషీట్‌ను దాఖలు చేయాలని సీఐడీ నిర్ణయించింది.

ఉగ్రవాదుల తరహా ప్రణాళిక
తెలంగాణలో ఎంసెట్‌-2 సహా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్‌ చేసిన ఎస్బీ సింగ్‌ ముఠా పోలీసులకు దొరక్కుండా ఉగ్రవాదుల తరహాలో పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. అందుకే రైల్వే పరీక్షలు మొదలుకొని వరసగా 11 ఏళ్లపాటు పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రభుత్వ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్‌ చేసినా ఎక్కడా చిక్కలేదు. ఎంసెట్‌-2 లీకేజీలోనూ ఎస్బీ సింగ్‌ ముఠా పదేళ్లుగా అనుసరిస్తున్న సూత్రాన్నే వాడుకుంది. ప్రశ్నపత్రం లీకైందనే ప్రచారం వరంగల్‌లో మొదలైనప్పటికీ.. అలా జరిగేందుకు అవకాశం లేదని అధికారులు తోసిపుచ్చారు. దీంతో తెలంగాణలోనూ తమ పాత ఫార్ములా పనిచేసిందని లీకేజీ ముఠా ఊపిరి పీల్చుకుంది.

ఇంతలో ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకేజీపై ‘ఆంధ్రజ్యోతి’ పూర్తి ఆధారాలతో కథనం ప్రచురించడంతో రాష్ట్రప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. మొదట్లో సీఐడీ చిన్న ఆధారం కూడా లభించలేదు. దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం(సీఐ సెల్‌) సహకారం తీసుకున్నారు. ఈ సెల్‌ విచారణలో లీకేజీ ముఠా ఉగ్రవాదుల తరహాలోనే ఆలోచించి పోలీసులకు ఎలాంటి ఆధారం దొరక్కుండా జాగ్రత్త పడినట్లు తేలింది. బిహార్‌ నుంచి ఆదేశిస్తుంటే ఏజెంట్లు ఎవ్వరికీ అనుమానం రాకుండా విద్యార్థుల ఎంపిక లక్ష్యాన్ని పూర్తి చేశారు. లీకేజీ విషయాలు మాట్లాడేందుకు సింగ్‌ ముఠా ఏజెంట్లకు ప్రత్యేక సిమ్‌ కార్డుల్ని సమకూర్చింది. ఫలితంగా కేసు దర్యాప్తు మొదటి రోజుల్లో అనుమానితుల్ని గుర్తించడం కష్టంగా మారింది. సీఐ సెల్‌ సాంకేతిక విశ్లేషణలో అసలు విషయం బయటకు రావడంతో బిహారీ ముఠాకు తెలంగాణలో చుక్కెదురైంది.

ఇతరుల ఫోన్‌తో..
పూర్తిగా నమ్మకం లేని ఏజెంట్లకు గ్యాంగ్‌ సిమ్‌ కార్డులు సమకూర్చలేదు. ఈ క్రమంలోనే మెడికో గణేష్‌ ప్రసాద్‌... స్నేహితుడికి తెలియకుండా అతని ఫోన్‌ను ఉపయోగించి మొత్తం కథ నడిపించాడు. మరికొందరు ఎంసెట్‌ లీకేజీ సమయంలో ప్రయాణాలు చేసినప్పుడు వారు రెగ్యులర్‌గా ఉపయోగించే ఫోన్‌ను ఇంట్లోనే ఉంచి వెళ్లారు. సాంకేతిక ఆధారాల్ని విశ్లేషించినప్పుడు అతను ఊర్లోనే ఉన్నట్లు చూపిస్తుండటంతో అలాంటి వారిని పట్టుకోవడం దర్యాప్తు అధికారులకు కష్టంగా మారింది. కాగా, వాసుబాబుతో పాటు శివనారాయణ, మెడికో గణేష్‌ ప్రసాద్‌ను కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం విచారించనుంది. వీరి నుంచి సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రశ్నావళి సిద్ధం చేశారు.
Tags