Type Here to Get Search Results !

18/7/18 విద్యా ఉద్యోగ ముఖ్య వార్తా సమాహారం

పీఆర్‌సీ కమిషనర్‌ బాధ్యతల స్వీకరణ

11వ పీఆర్‌సీ కమిషనర్‌ అశుతోష్‌ మిశ్రా మంగళవారం సచివాలయంలో పూర్తిస్థాయి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీ గెజిటెడ్‌ అధికారుల జేఏసీ అఽధ్యక్షుడు కృష్ణయ్య, జేఏసీ నాయకులు అశుతోష్‌ మిశ్రాను కలిసి అభినందనలు తెలిపారు.

ఉపాధ్యాయ పురస్కారాల దరఖాస్తు గడువు 31st July 

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2018 దరఖాస్తులకు ఈ నెల 31 ఆఖరి తేదీ అని పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి తెలిపారు. తాము సాధించిన విజయాలు, వాటి ప్రభావం, ఇతర అంశాలను దరఖాస్తుకు జత చేస్తూ, www.cse.gov.in వెబ్‌సైట్లో టీచర్స్‌ కార్నర్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

డీసెట్‌ రీ షెడ్యూల్‌ 25 నుంచి 29 వరకు కౌన్సెలింగ్‌

డీసెట్‌-2018 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ మరోసారి మార్చారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 29 వరకూ http://apdeecet.apcfss.in, //cse.ap.gov.in వెబ్‌సైట్లో తమ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 30 నుంచి ఆగస్టు 2 వరకు సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇదిలా ఉండగా 279 ప్రైవేట్‌ డీఎడ్‌ కాలేజీలకు అఫిలియేషన్‌ రెన్యువల్‌ (2018-19) చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

యాప్‌.. ‘లోడింగ్‌’ అప్‌!

బోధనేతర పనుల్లో టీచర్లు సతమతం
ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వాడుకోరాదని ఒకానొక దశలో భావించినా.. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే క్రమంలో విద్యాశాఖకు అంతకంటే గత్యంతరం లేదు. పైగా హడావుడి నిర్ణయాలు.. ఆదేశాలు.. ఫలితంగా ఉపాధ్యాయలోకం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రభుత్వం నిర్దేశించే బోధనేతర కార్యక్రమాల అమలుకు సంబంధించి రోజుకో యాప్‌ రూపొందించి.. సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయమనడం పరిపాటిగా మారుతోంది. అది పాఠ్యపుస్తకాల సరఫరా కావచ్చు .. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌.. మొక్కలు నాటే కార్యక్రమం.. ఇలా ఏదైనా కావచ్చు.. ప్రతి పనికీ ఫొటో తీయడం, దాన్ని నిర్దేశిత యాప్‌కు అనుసంధానించడం, సీఎస్సీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయమనడం సర్వసాధారణంగా మారింది. ఈ అప్‌లోడ్‌ తంతుతోనే ఉపాధ్యాయులకు ఏడాదిలో సగం రోజులు సరిపోతుండగా, పిల్లలకు పాఠాల ఊసే లేకుండా పోతోంది. మధ్యాహ్న భోజన పథకాన్ని సంబంధించి రోజూ విద్యార్థుల వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి రోజూ ఫొటో తీసి పంపాల్సిందే. ఇవే కాదు ..జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాల నిర్వహణ, ఇతర కార్యక్రమాల అమలుపైనా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిందే. వేసవి సెలవుల్లోనే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉన్నా ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ వ్యవహరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు పాఠ్యపుస్తకాల ముద్రణకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోకుండా తీరా పాఠశాలలు తెరిచిన తర్వాత హడావుడి చేయడం ఏటా ఓ ప్రహసనంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేయాల్సి ఉండగా, బడులు తెరచి నెల రోజులు గడచినా తుది అకడమిక్‌ క్యాలెండర్‌ ఊసే లేదు. ఈ ప్రభావం బోధనపై పడుతోందన్న అభిప్రాయాలున్నాయి. పాఠశాలల్లో బోధన, బోధనేతర కార్యకలాపాలపై స్పష్టత ఇచ్చి ఉపాధ్యాయుల్లో అవగాహన కల్పించేందుకు ముందస్తుగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా ఆచరణ శూన్యంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘ఐటీ’ ఫలితాలు రాబట్టుకోవడాన్ని స్వాగతించాల్సిన పరిణామమే అయినా.. అందుకు అనుసరిస్తున్న పద్ధతులు మాత్రం విమర్శల పాలవుతున్నాయి.

సమాన వేతనం' ఇచ్చే వరకూ పోరాటం

- రెండోదశ ఆందోళనకు సిద్ధం కండి
- విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల జెఎసి పిలుపు
'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పీస్‌రేట్‌ రద్దు చేయాలి' అని ఎపి విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక ఛైర్మన్‌ ఎం.బాలకాశి డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ సంస్థలో 24వేల మంది కాంట్రాక్టు కార్మికులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, వీరి సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోం దన్నారు. రెండో దశ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతిలోని రామతులసీ కళ్యాణ మండపంలో చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రాంతీయ రాష్ట్రస్థాయి సదస్సు మంగళవారం జరిగింది. ఈ సదస్సులో ఛైర్మన్‌ ఎం.బాలకాశి, కన్వీనర్‌ గంగయ్య, చీఫ్‌ కోఆర్డినేటర్‌ కట్టా నాగరాజు, కోఆర్డినేటర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులకు డైరెక్టు పేమెంట్‌, సమాన పనికి సమాన వేతనం, పీస్‌ రేటు రద్దు వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే, కార్మికులు మరోసారి ఆందోళన చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల కార్మికులకు వేతనాలను పెంచి విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులకు పెంచకపోవడం అన్యాయమన్నారు. గత ఫిబ్రవరిలో కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేసిన సందర్భంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన యాజమాన్యం మాట తప్పిందన్నారు. కేవలం 25 శాతం వేతనాలు మాత్రమే పెంచుతామని యాజమాన్యం చెప్పడం దుర్మార్గమన్నారు. కనిష్టంగా 16వేల నుంచి, గరిష్టంగా 26వేలకు పెంచాలని ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టే పోరాటానికి సిఐటియు మద్దతు ఉంటుందన్నారు. ఈ సదస్సులో యుఇఇయు డిస్కం కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ఐక్యవేదిక వైస్‌ఛ్తెర్మన్‌ జె.రాజశేఖర్‌, లోకేష్‌, రాష్ట్రనాయకులు శ్రీను, కృష్ణ, సత్య, జిలానీ, ఖాదర్‌వలీ పాల్గొన్నారు.

రాష్ట్ర ఉత్త‌మ‌ ఉపాధ్యాయ పురస్కారాల ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం..*

*పాఠ‌శాల విద్యా క‌మీష‌న‌ర్ సంధ్యారాణి*
*జూలై 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం..*
🍏రాష్ట్ర ఉత్త‌మ ఉపాధ్యాయ పుర‌స్కారాలు-2018 కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నామ‌ని, ఈనెల 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని పాఠ‌శాల విద్యా క‌మీష‌న‌ర్ కె.సంధ్యారాణి తెలిపారు.
🍎ఈ అవ‌కాశాన్ని వినియోగించుకొని ఎక్కువ శాతం ఉపాధ్యాయులు పుర‌స్కారాలకు ద‌ర‌ఖాస్తు చేయాల‌ని తెలిపారు. ఈ మేర‌కు క‌మీష‌న‌ర్ మంగ‌ళ‌వారం పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
🍏జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పుర‌స్కారాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న విధానం మాదిరిగానే రాష్ట్రంలోనూ ఆన్ లైన్ లో ప్ర‌తిపాద‌న‌లు పంపించుకునేలా కొత్త విధానాన్ని రూపొందించామ‌ని చెప్పారు.
🍎తాము సాధించిన విజ‌యాలు, వాటి ప్ర‌భావం, ఇత‌ర అంశాలు పూర్తి స్థాయిలో ద‌ర‌ఖాస్తుకు జ‌త చేయాల‌ని ఉపాధ్యాయుల‌కు సూచించారు.
🍏జూలై 31 అర్ధ‌రాత్రి వ‌ర‌కు గ‌డువు వుంటుంద‌ని, www.cse.gov.in వెబ్ సైట్ లో టీచ‌ర్స్ కార్న‌ర్ లోకి వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని పాఠ‌శాల విద్యా క‌మీష‌న‌ర్ కె.సంధ్య‌రాణి స్ప‌ష్టం చేశారు.

తేలని ఎస్జీటీ పంచాయితీ..!

డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీలను అనుమతించే అంశంపై ప్రభుత్వం ఇంకా ఆమోదముద్ర వేయలేదు. అటు ఎన్‌సీఈఆర్టీ జారీచేసిన ఆదేశాల అమలుపై మౌనంగా ఉంది. దీంతో రాబోయే డీఎస్సీలో బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీలో అవకాశమిస్తారా? లేదా? అనేదీ అభ్యర్థుల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాలు బీఈడీ కౌన్సెలింగ్‌పై కొంత ప్రభావం చూపాయని విద్యావేత్తలు భావిస్తున్నారు. 

ఈ నెల 11నుంచి 13వరకూ నిర్వహించిన తొలివిడత ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌కు నిరాదరణ లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో భారీగా సీట్లు మిగిలిపోయే పరిస్థితులు న్నాయి. 30వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహణకు ఉన్నత విద్యాశాఖాధికారులు సిద్ధమయ్యారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీలు అర్హులేనంటూ జాతీయ విద్యా పరిశోధనా మండలి(ఎన్‌సీఈఆర్టీ) ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్య కోటాలోని సీట్లకు భారీగా ఫీజులు పెంచి అడ్మిషన్ల నిర్వహణకు సిద్ధమయ్యాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో స్పందన లేనందున వారికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఈ ఏడాది సీట్ల భర్తీ ప్రక్రియను ఎలా నిర్వహించాలనే దానిపై వారంతా ఆందోళన చెందుతున్నారు.
రెండేళ్ల పొడిగింపుతో తగ్గిన ఆదరణ : బీఈడీకి రెండేళ్ల కాలవ్యవధి పెంచడంతో ఆదరణ తగ్గింది. అప్పటినుంచి ఈ కోర్సుపై అభ్యర్థులు ఆసక్తి చూపట్లే దు. విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ) ప్రకారం బీఈడీ పూర్తిచేసిన వారంతా టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలన్న నిబంధన విధించారు. ఏపీ టెట్‌-2017, 2018 టెట్‌ పరీక్షలలో బీఈడీ, డీఎడ్‌, లాంగ్వేజీ పండిట్ల సబ్జెక్టుల వారంతా దాదాపు 50శాతమే అర్హత సాధించలేదు. ఏడాది నుంచి డీఎస్సీ ప్రకటన్ని వాయిదా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ సక్రమంగా లేనందున..ఆ ప్రభావం బీఈడీ అడ్మిషన్లపై పడింది. 

2018-19 విద్యా సంవత్సరానికిగాను కన్వీనర్‌ కోటా కింద 25,672 సీట్లున్నాయి. ఇందులో ప్రభుత్వ, వర్సిటీ, ఎయిడెడ్‌ బీఈడీ కళాశాలల్లో 1,010 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 24,662 సీట్లు ఉన్నాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో 2,891 సీట్లను భర్తీ చేశారు. ఈ విద్యా సంవత్సరం బీఈడీ అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ పరీక్షలో 7,505 మంది అర్హత సాధించారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో 3,171 మంది విద్యార్హత పత్రాలను ధ్రువీకరించుకున్నారు. 2,911 మంది ఆప్షన్లు నమోదు చేసుకోలేదు. మలివిడత కౌన్సెలింగ్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైతే..రాష్ట్రంలో భారీగా బీఈడీ సీట్లు మిగిలిపోతాయనే ఆందోళనతో అధికారులున్నారు. 
ఎస్జీటీ పోస్టులకు బీఈడీలను అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశిస్తే..మళ్లీ అభ్యర్థుల మధ్య వివాదం తలెత్తే ప్రమాదముంది. ఇప్పటికే ఎన్‌సీఈఆర్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డీఎడ్‌ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. వారికి దీటుగా బీఈడీలూ నిరసనలకు దిగుతున్నారు. దీన్ని అదునుగా తీసుకుని ప్రభుత్వం డీఎస్సీ వాయిదా వేసి మౌనంగా ఉందనే విమర్శలున్నాయి. ఎస్జీటీ-బీఈడీల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని, డీఎస్సీ ప్రకటన్ని విడుదల చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండు చేస్తున్నాయి