సుకన్య సమృద్ధిలో రూ.250 జమచేస్తే చాలు
సుకన్య సమృద్ధి ఖాతా -2016 నిబంధనలను సవరిస్తూ.. ఖాతా తెరిచేందుకు కనీసంగా రూ.250 డిపాజిట్ చేసేలా వెసులుబాటు కల్పించింది. ఏటా ఖాతాలో పొదుపు చేసే మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.250కి తగ్గించింది.
గరిష్ఠంగా ఈ ఖాతాలో ఏటా రూ.1.5 లక్షల వరకు జమ చేయొచ్చు. ఈ పథకం ప్రకారం.. బ్యాంకులో ఖాతా తెరిచిన నాటినుంచి 21 ఏండ్ల వరకు ఖాతా చెల్లుబాటు అవుతుంది. ఈ సమయం పూర్తయిన తర్వాత జమచేసిన మొత్తాన్ని ఖాతాదారైన బాలికకు అందజేస్తారు. ఖాతా తెరిచిన నాటినుంచి 14 ఏండ్లపాటు డిపాజిట్లు స్వీకరిస్తారు. దీనితర్వాత నిబంధనల ప్రకారం ఖాతాలో కేవలం వడ్డీ మాత్రమే జమవుతుంది.
సుకన్య సమృద్ధి ఖాతా వడ్డీరేటు ప్రతి మూడునెలలకోసారి మారుతుంటుంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వడ్డీరేటును 8.1 శాతంగా నిర్ణయించారు. 2015లో ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన విజయవంతమైందని 2018-19 బడ్జెట్ ప్రసంగంలో కేంద్రమంత్రి జైట్లీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2017 నవంబర్ నాటికి ఈ పథకం కింద 1.26 కోట్లకు పైగా ఖాతాలు తమ పిల్లల పేరుపై తెరిచారని, రూ.19,183 కోట్లు జమ చేశారని చెప్పారు.