Type Here to Get Search Results !

17/7/18 విద్యా ఉద్యోగ ముఖ్య వార్తల సమాహారం

అప్పగిస్తే డిఎస్సీనీ నిర్వహిస్తాం

- అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాల విడుదల
- ఎపిపిఎస్‌సి చైర్మన్‌ ఉదయ భాస్కర్‌
విశ్వవిద్యాలయాల్లోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీల భర్తీ కోసం ఏప్రిల్‌లో నిర్వహించిన స్క్రీనింగ్‌ పరీక్షా ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఎపిపిఎస్‌సి చైర్మన్‌ ఉదయభాస్కర్‌ వెల్లడించారు. తమ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరీక్ష ఫైనల్‌ కీను కూడా వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. 64 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహించామని, 40 సబ్జెక్టులకు ఫలితాలు వెల్లడిస్తున్నామని, మిగిలిన 24 సబ్జెక్టులకు రోజుకు కొన్ని చొప్పున విడుదల చేస్తామని తెలిపారు. ఇంటర్వ్యూల బాధ్యత యూనివర్సిటీల దేనన్నారు. ఒసిలకు 40 శాతం, బిసిలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 30 శాతం అర్హత మార్కులుగా పరిగణించామన్నారు. అవసరమైనంత మంది అర్హత సాధించని సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహిస్తామన్నారు. 

ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి డిఎస్సీ నిర్వహణ గురించి ఇప్పటి వరకూ తమకు సమాచారం లేదని, ప్రభుత్వం ఆ బాధ్యతను అప్పగిస్తే నిర్వహించేందుకు ఎపిప ిఎస్‌సి సిద్ధంగా ఉందని చైర్మన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి త్వరలో చాలా పోస్టుల భర్తీకి అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని, గ్రూప్‌-1 రివైజ్డ్‌ సిలబస్‌ డ్రాఫ్ట్‌ను రూపొం దించామని, దానిపై అభ్యర్థుల, నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

వెబ్‌సైట్లో 40 సబ్జెక్టుల మార్కులు
ఇంటర్వ్యూల నిర్వహణ బాధ్యత వర్సిటీలదే
గ్రూప్‌-1 పరీక్షలకు కొత్త సిలబస్‌: ఏపీపీఎస్సీ
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకోసం నిర్వహించిన స్ర్కీనింగ్‌ టెస్ట్‌ మార్కులను ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. మొత్తం 64 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించారు. అందులో 40సబ్జెక్టుల మార్కులను వెబ్‌సైట్లో ప్రదర్శించింది. మిగిలినవి ఈ వారాంతంలోగా విడుదల చేస్తామని తెలిపింది. సోమవారం విజయవాడలోని కమిషన్‌ కార్యాలయంలో సభ్యులు కె.పద్మరాజు, విజయకుమార్‌తో కలిసి చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ మీడియాతో మాట్లాడారు. పోస్టులు నోటిఫై చేసిన విశ్వవిద్యాయలయాలన్నింటికీ మార్కులు పంపిస్తామని చెప్పారు. తాము నిర్వహించింది స్ర్కీనింగ్‌ టెస్ట్‌ మాత్రమేనని, ఇంటర్వ్యూలు జరపాల్సిన బాధ్యత వర్సిటీలదేనని పేర్కొన్నారు.

ఓసీ అభ్యర్థులకు 40శాతం, బీసీలకు 35శాతం, ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులకు 30శాతం క్వాలిఫైయింగ్‌ మార్కులుగా వర్సిటీలు తమ నోటిఫికేషన్లలో పేర్కొన్నాయని గుర్తుచేశారు. చాలా సబ్జెక్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నారని, కొన్నిట్లో మాత్రమే తగినంతమంది లేరని తెలిపారు. మరికొన్నింటికి అసలు అర్హులైన అభ్యర్థులే లేరని, వర్సిటీలు కోరితే ఆయా సబ్జెక్టుల్లో మళ్లీ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కాగా, గ్రూప్‌-1 సర్వీసె్‌సకు సంబంధించి సిలబ్‌సను రివైజ్‌ చేస్తున్నామని చైర్మన్‌ చెప్పారు. ఇప్పటికే తయారైన డ్రాప్టు సిలబ్‌సను కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. త్వరలో విడులయ్యే నోటిఫికేషన్‌లో కొత్త సిలబ్‌సను ప్రవేశపెడతామని వివరించారు.

22,781 బీఈడీ సీట్లు ఖాళీ!

25,672 సీట్లకు 2,891 మాత్రమే భర్తీ
23 నుంచి తరగతులు ప్రారంభం
నెలాఖరులో మలిదశ కౌన్సెలింగ్‌?
బీఈడీ అడ్మిషన్ల పతనం ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 11నుంచి 15వరకు ఎడ్‌సెట్‌-2018 కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దానిప్రకారం సోమవారం కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపు చేపట్టారు. ర్యాంకర్లకు మొత్తం 25,672సీట్లు అందుబాటులో ఉండగా 2,891 మాత్రమే భర్తీ అయ్యాయి. 22,781సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. రాష్ట్రంలో వర్సిటీ, గవర్నమెంట్‌, ప్రైవేట్‌ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ యాజమాన్యాల్లో కలిపి మొత్తం 425 బీఈడీ కాలేజీలు ఉన్నాయి. కాగా, అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సీట్ల కేటాయింపు సమాచారం పంపించామని, లాగిన్‌ ఐడీ, హాల్‌టికెట్‌ నంబరు, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ ద్వారా లాగిన్‌ అయి అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎడ్‌సెట్‌ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ తెలిపారు. సీటు అలాట్‌ అయినవారు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ సిస్టమ్‌ ద్వారా తెలియజేసి, ఈనెల 23లోగా ఆయా కాలేజీల్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలు సమర్పించాలని సూచించారు. గడువు తేదీలోగా రిపోర్టింగ్‌ చేయకుంటే అలాట్‌మెంట్‌ రద్దవుతుందని చెప్పారు. ఈనెల 23నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఎడ్‌సెట్‌ మలివిడత కౌన్సెలింగ్‌ ఈనెల 30, 31తేదీల్లో జరిగే అవకాశం ఉందన్నారు.

ఏపీ శాస్త్రవేత్తలకు ఐసీఏఆర్‌ అవార్డులు

రాష్ట్రానికి చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు కళ్యాణ్‌ బాబు, హేమా బలివాడకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌) అవార్డులు లభించాయి. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్‌ 90వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర మంత్రి రాధామోహన్‌ సింగ్‌ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. క్రాప్‌ అండ్‌ హార్టికల్చర్‌ సైన్సెస్‌ విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పామ్‌ రిసెర్చ్‌లో అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న కళ్యాణ్‌ బాబుకు లాల్‌బహదుర్‌ శాస్త్రీ ఔట్‌స్టాండింగ్‌ యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు- 2017 దక్కింది. అవార్డులో భాగంగా రూ. లక్ష నగదు, మూడు నెలలు విదేశాల్లో శిక్షణ పొందేందుకు రూ.5 లక్షలు, పరిశోధన గ్రాంట్‌కు మూడేళ్ల పాటు ఏటా రూ.10 లక్షలు బహుమానంగా అందుకున్నారు. రాజమండ్రిలోని సెంట్రల్‌ టుబాకో రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న హేమా బలివాడకు ‘‘జవహర్‌లాల్‌ నెహ్రూ అవార్డ్‌ ఫర్‌ పీజీ ఔట్‌స్టాండింగ్‌ డాక్టరాల్‌ థిసిస్‌ రిసెర్చ్‌ ఇన్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ - 2017’’ లభించింది.

ట్రిపుల్‌ఐటీ సీట్ల భర్తీపై హైకోర్టు స్టే

వేంపల్లె, జూలై 16: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2018-19 విద్యా సంవత్సరానికి జరిగిన ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలపై హైకోర్టు వారం రోజుల పాటు స్టే విధించింది. ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్‌ ప్రక్రియపై కడప జిల్లా నుంచి హైకోర్టులో వాజ్యం దాఖలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 0.4 గ్రేడ్‌ మార్కులు కలిపి మొదటి జాబితా విడుదల చేయడం అన్యాయమని, తద్వారా మెరిట్‌ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని కోర్టులో వేసిన ఈ వాజ్యంలో పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం అడ్మిషన్‌ ప్రక్రియ నిలుపుదల చేసి వారంలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రెండో దఫా కౌన్సెలింగ్‌కు సంబంధించిన జాబితా విడుదల వాయిదా పడింది.

నీట్‌’ గ్రేస్‌ మార్కులపై సుప్రీంలో అప్పీల్‌

‘నీట్‌’లో గ్రేస్‌ మార్కులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ చెన్నైకి చెందిన విద్యార్థి సత్యదేవన్‌ సుప్రీంకోర్టుకు అప్పీలు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో తమిళనాట 24 వేల మంది విద్యార్థులు నీట్‌ పరీక్ష రాశారు. అయితే తమిళ ప్రశ్నపత్రం తర్జుమాలో తప్పులు దొర్లడంతో ఆ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు మార్కులు తగ్గాయి. వారికి 196 గ్రేస్‌ మార్కులను కలపాలని, కొత్త నీట్‌ ర్యాంకుల జాబితాను విడుదల చేయాలంటూ సీబీఎ్‌సఈని మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌ ఆదేశించింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సత్యదేవన్‌ సుప్రీంకోర్టులో గత శనివారం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
Tags