Type Here to Get Search Results !

ఉపాధ్యాయ పోస్టుల కుదింపు సమంజసమేనా

ఉపాధ్యాయ పోస్టుల కుదింపు సమంజసమేనా


పాఠశాల విద్య, అందులోనూ ప్రాథమిక విద్య మొత్తం విద్యారంగానికి పునాది వంటిది.*
*కాని ప్రాథమిక విద్యపై ఒక రకమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది.*

🌻ఉపాధ్యాయ నియామకాల గురించి గత సంవత్సరకాలంగా విద్యాశాఖా మంత్రి, అధికారులు వివిధ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. గత ఏప్రిల్‌ నెలలో చేసిన ప్రకటన ప్రకారం కొద్దిరోజులలో 10,351 ఉపాధ్యాయ పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి. గత సంవత్సరం మే నెలలో 22,804 పోస్టులకు నోటిఫికేషన్‌ వస్తుందని ప్రకటనలు వచ్చాయి. ఇంకొక సందర్భంలో 14,494 పోస్టులకు నోటిఫికేషన్‌ అన్నారు. ఈ మేరకు జిల్లాలవారీగా, కేటగిరీల వారిగా వివరాలు కూడా ప్రకటించారు. మధ్యలో 10,603 అన్న సంఖ్య కూడా వచ్చింది. ప్రస్తుత సంఖ్య 10,351. ఈ సంఖ్యకు ఇంతవరకు జిల్లాల వారీ వివరాలు రాలేదు. దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

🌻మన రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (యస్‌.జి.టి) పోస్టులు ఉంటాయి. అలాగే ఉన్నత పాఠశాలలలో సబ్జక్టు టీచర్లు (పాఠశాల సహాయకులు) భాషాపండితులు, పి.ఇ.టి పోస్టులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా మన 13 జిల్లాలకు కలిపి 75,060 యస్‌.జి.టి పోస్టులు వచ్చాయి. వాటిలో ప్రస్తుతం 70,276 మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. అంటే 4,784 స్పష్టమైన ఖాళీలు ఉన్నాయి. అదలా ఉండగా, పనిచేస్తున్నవారిలో 1,787 మంది ఉపాధ్యాయులకు పాఠశాల సహాయకులుగా పదోన్నతి ఇవ్వనున్నారు. వీరు ఉన్నత పాఠశాలలకు వెళ్ళిపోతారు.

🌻అంటే యస్‌.జి.టి పోస్టుల ఖాళీలు ఇంకా పెరిగి 6,571 అవుతాయి. వీటిలో కర్నూలు జిల్లా కొరకు డి.యస్‌.సి 2018 ద్వారా 1,393 యస్‌.జి.టి పోస్టులకు నియామకాలు జరుపనున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు బదలాయించగా 5,178 యస్‌.జి.టి పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే, ఆ పోస్టులకు నియామకాలు చేపట్టడంలేదు. అందుకు వ్యతిరేకంగా ఆ పోస్టులను ఉన్నత పాఠశాలలకు బదలాయిస్తూన్నారు. ముందు పేర్కొన్నట్లు ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించడం వేరు. దానికి ఎవరూ అభ్యంతర చెప్పరు. కాని ఇక్కడ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలకు కొత్తగా పోస్టులు ఇవ్వడానికి బదులు ప్రాథమిక పాఠశాలల పోస్టులను బదలాయిస్తోంది. అందుకే చర్చనీయాంశం అయింది. పైన చూపించిన 5,178 ఖాళీ యస్‌.జి.టి పోస్టులలో4,553 పోస్టులను సప్రెస్‌ (కన్వర్ట్‌) చేసి ఆ జీతాల బిల్లుకు తగ్గట్లు 3,626 ఉన్నత పాఠశాల పోస్టులను క్రియేట్‌ చేస్తూన్నారు. ఇంకా మిగిలిన 625 యస్‌.జి.టి ఖాళీలను కూడా నింపడంలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాథమిక పాఠశాలలకు తక్షణమే 5,178 యస్‌.జి.టి పోస్టులు దూరం అవుతున్నాయి.

🌻ప్రాథమిక పాఠశాలల పోస్టులు ఎందుకు ఉన్నత పాఠశాలలకు కన్వర్ట్‌ చేస్తూన్నారని అడిగితే అవన్నీ మిగులు పోస్టులు అంటున్నారు. ఇవి నిజంగా మిగులు పోస్టులా? ఈ పోస్టులు ఎలా మిగిలాయో పరిశీలిస్తేగాని విద్యాశాఖ జిమ్మిక్కులు అర్థం కావు. ‘విద్యా హక్కు చట్టం–- 2009’ ప్రకారం ప్రాథమిక పాఠశాలలలో బాలల సంఖ్య 60 లోపున ఉన్నా, 30 లోపున ఉన్నా, 20 లోపున ఉన్నా ప్రభుత్వం ఆ పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలి. కాని ఉమ్మడి రాష్ట్రం కాలం నుండి ప్రభుత్వం 20 లోపున నమోదు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉపాధ్యాయ పోస్టును మాత్రమే ఇస్తోంది. రాష్ట్రంలో నమోదు 20 లోపున ఉన్న ప్రాథమిక పాఠశాలలు 6,873 ఉన్నాయి. ఇవన్నీ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా నడుపబడుతున్నాయి. ఫలితంగా ప్రతి రెండు పోస్టుల దగ్గర ఒకటి చొప్పున 6,873 యస్‌.జి.టి పోస్టులు మిగిలాయి. అంటే వేలాది పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా దిగజార్చడం ద్వారా మిగిలిన పోస్టులివి.

🌻ఇది చాలదన్నట్లు ఇప్పుడు బాలల నమోదు 21 నుండి 30 లోపున ఉన్న 8,315 పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చడానికి ప్రభుత్వం క్రొత్తగా పావులు కదుపుతోంది. అంటే ఇప్పుడు 8,315 ప్రాథమిక పాఠశాలలకు కేటాయించబడిన 16,630 పోస్టులలో సగానికి సగం మిగుల్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే మిగుల్చుకుని రద్దుచేయదలచుకున్న 8,315 పోస్టులలో 7,490 మంది ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. ఖాళీగా ఉన్న 825 పోస్టులు ముందుగా సూచించిన 5,178 పోస్టులలో భాగంగా తక్షణమే రద్దవుతాయి. కాగా, ప్రస్తుతం వేకెన్సీ లేని 7,490 పోస్టులు పదవీవిరమణల క్రమంలో రద్దవుతాయి. అంటే, తక్షణమే 5,178 పోస్టులు, రానున్న రెండేళ్ళలో 7,490 పోస్టులు, మొత్తంగా చూస్తే 12,668 యస్‌.జి.టి పోస్టులు రద్దు కానున్నాయన్న మాట. ఏకోపాధ్యాయ పాఠశాలలు క్రమంగా నమోదును కోల్పోయి మూసివేతలకు దారితీస్తాయనే విషయం తెలిసిందే.

🌻పాఠశాల విద్య, అందులోనూ ప్రాథమిక విద్య మొత్తం విద్యారంగానికి పునాది వంటిది. కాని ప్రాథమిక విద్య ఎడల రాష్ట్రంలో ఒక రకమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. నిజానికి ప్రమాణాలు గల విద్యకు పాదార్థికంగా కావలసినవి ఎ) మౌలిక వసతులు, బి) అవసరమైనంతమంది ఉపాధ్యాయులు, సి) పాఠ్య పుస్తకాలతో సహా విద్యార్థి మద్దతు చర్యలు. తగిన విద్యార్థి మద్దతు చర్యలు లేక ఐదవ తరగతి లోపుననే బాలలు పెద్ద సంఖ్యలో చదువు మానివేస్తూన్నారు. డ్రాప్‌ ఔట్‌ల వలననే నమోదు పడిపోతోంది. మౌలిక వసతులు, తగినంతమంది ఉపాధ్యాయులు లేకపోయినా తమకైతాము బడికి వస్తూన్న వారికి కూడా కనీస ప్రమాణాలు గల విద్య అందటం లేదు. రాష్ట్రంలో ఉన్న సుమారు 30వేల ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత లేని పాఠశాలలు నాలుగువేలు లోపు మాత్రమే. ఇక బాలల నమోదు 41 నుండి 60 వరకు గల ప్రాథమిక పాఠశాలు సుమారు ఐదువేలు ఉంటాయి. ఈ పాఠశాలలకు రెండు పోస్టులు మాత్రమే ఇస్తూన్నారు. వీటికి మూడవ పోస్టు ఇస్తే ఇవి అభివృద్ధిచెందగలవు. అలాగే బాలల నమోదు 61 నుండి 80 వరకు గల పాఠశాలలు రెండువేల ఐదువందల పైచిలుకు ఉన్నాయి. వీటికి ప్రస్తుతానికి ప్రభుత్వం మూడు పోస్టులు మాత్రమే ఇస్తోంది. వీటికి నాలుగవ పోస్టు ఇస్తే నమోదును పెంచుకుని ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధిచెందగలుగుతాయి.

🌻ఉన్నత పాఠశాలల విషయానికి వస్తే, పరిస్థితి మరొక విధంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సక్సెస్‌ పాఠశాలల విధానాన్ని తీసుకువచ్చారు. ఆ పేరుతో అనేక విలీనాలు జరిగాయి. సక్సెస్‌ పాఠశాలలలో ఆంగ్లమాధ్యమాన్ని సమాంతరంగా పెట్టారు. ఆంగ్లమాధ్యమం పెట్టడంతో సక్సెస్‌ పాఠశాలలలో బాలల నమోదు పెరిగింది. ఐదవ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలలో చదివించిన దిగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నత పాఠశాల విద్య కొరకు తమ బాలలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించారు. గత కొద్ది సంవత్సరాల కాలంలో నమోదు బాగా పెరిగింది. అయితే ప్రభుత్వాలు పెరిగిన నమోదు మేరకు కొత్తగా తరగతి గదుల నిర్మాణం చేపట్టలేదు, ఇతర సౌకర్యాల ఏర్పాటు చేయలేదు.

🌻అవసరమైనంత మంది ఉపాధ్యాయులను కూడా నియమించలేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకూ తరగతి గదిలో విద్యార్థుల గరిష్ఠ సంఖ్య 35 ఉండాలి. అలాగే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ ప్రకారం 9, 10 తరగతులలో తరగతి గదిలో విద్యార్థుల గరిష్ట సంఖ్య 40 ఉండవచ్చు. కాని రాష్ట్ర ప్రభుత్వం 6 నుండి 10 వతరగతి వరకూ విద్యార్థుల గరిష్ఠ పరిమితిని 48 గా చేస్తూ గత సంవత్సరం మే నెలలో జి.ఒ 29 తీసుకువచ్చింది. ఆ విధంగా చూసుకున్నా ఇప్పుడు 7,218 క్రొత్త ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వాలి. అందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ప్రాథమిక పాఠశాలల పోస్టులను ఉన్నత పాఠశాలల పోస్టులుగా కన్వర్టు చేయాలని ప్రయత్నిస్తూంది. ఇది సరైనదేనా?

*రమేష్‌ పట్నాయిక్‌*
*కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ విద్యాపరిరక్షణ కమిటి*
Tags