Type Here to Get Search Results !

మై ఏపీ పోర్టల్‌ - ఈ ప్రగతి పోర్టల్ ప్రారంభం

మై ఏపీ పోర్టల్‌ -  ఈ ప్రగతి పోర్టల్ ప్రారంభం

  • ఒకే ప్రభుత్వం-ఒకే పోర్టల్‌
  • ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
  • ప్రపంచంలోనే మెరుగైన వ్యవస్థ
  • ఇదో విప్లవం.. ప్రజాసంతృప్తే ముఖ్యం
  • భవిష్యత్తులో 750 సేవలు ఒకేచోట
  • 120 రకాల సర్టిఫికెట్ల జారీ కూడా
  • ‘మై ఏపీ’ పోర్టల్‌ ఆవిష్కరణలో సీఎం


సాంకేతికత వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది. సమర్థంగా, పారదర్శకంగా, అత్యంత వేగంగా పౌరసేవలు అందించేందుకు ‘ఈ-ప్రగతి కోర్‌ ప్లాట్‌ఫామ్‌’ను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘మై ఏపీ పోర్టల్‌’ను సీఎం చంద్రబాబు గురువారం ఆవిష్కరించారు. దీంతోపాటే ఈ-ప్రగతి శాఖ స్వయంగా అభివృద్ధి చేసిన యాప్‌ స్టోర్‌ను కూడా ఆవిష్కరించారు. వివిధ ధ్రువపత్రాలు, లైసెన్సులు, అనుమతులు... ఇలా ఏ అవసరమైనా దరఖాస్తు చేయడం నుంచి.. సేవ పొందడం వరకూ అంతా ఒకే చోట, ఒకే పోర్టల్‌ నుంచి చేసుకోవచ్చు. నాలుగేళ్ల క్రితం సీఎం మదిలో మెదిలిన ఈ ఆలోచన ఇప్పుడు ఆవిష్కృతమైంది. చదువురాని వారికి కూడా ఉపయోగపడేలా మన మాటలను గుర్తించి దానికి అనుగుణమైన సేవను అందించేందుకు అవసరమైన సులభతరమైన ప్రక్రియను తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అంతిమంగా ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందించడమే ముఖ్యమన్నారు. ఈ దిశగా ‘ఈ-ప్రగతి’ ముందడుగు, విప్లవమని వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో 750 ప్రభుత్వ సేవలు, 120 రకాల సర్టిఫికెట్లు ‘మై ఏపీ పోర్టల్‌’ ద్వారా పొందవచ్చన్నారు. ఐటీ మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... ప్రభుత్వంలోని అన్ని సేవలను ఒకే పోర్టల్‌ ద్వారా అందించడం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ మాట్లాడుతూ... చంద్రబాబు పట్టుదల వల్లే ఈ ప్రయత్నం విజయవంతమైందన్నారు. ఐటీ కార్యదర్శి విజయానంద్‌, ఈ-ప్రగతి సీఈవో బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

డేటాలిటిక్స్‌
ఉన్న సమాచారాన్ని విశ్లేషణ చేసి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పుడున్న పంటలకు ఎంతెంత ధరలున్నాయి? దేశంలో ధరలు ఎలా ఉన్నాయి? అంతర్జాతీయ మార్కెట్లలో ఎలా ఉన్నాయి? అని విశ్లేషిస్తారు. ఆరునెలల తర్వాత ఫలానా పంటకు ఎక్కువ ధర ఉంటుంది అనిపిస్తే ఆ పంట వేయాలని రైతులకు సూచించవచ్చు. ప్రతి విభాగంలోనూ ఇలా సమాచార విశ్లేషణ చేయవచ్చు. ప్రజలకు, పరిశ్రమలకు అవసరమైన దాదాపు 120 లైసెన్సులు ఇందులో ఉంటాయి. వీటి అవసరం ఉన్న వారు దరఖాస్తు చేసుకుని తీసుకోవచ్చు.

కాగిత రహిత పాలన
కాగిత రహిత ప్రభుత్వ పాలన(సీఎల్‌జీఎస్‌) విభాగం కూడా ప్రారంభించారు. ఒక విద్యార్థి ఇక్కడ ఇంటర్‌ చదివాడు. గ్రాడ్యుయేషన్‌కు అమెరికా వెళ్లాడు. అక్కడి విశ్వవిద్యాలయం... ఇంటర్‌ మార్కుల జాబితా, జనన ధ్రువపత్రం వివరాలు అడిగితే... సీఎల్‌జీఎస్‌ నుంచి తీసి ఇవ్వవచ్చు. విద్యాశాఖలో ఈ ఏడాది ఇంటర్‌ చదివిన పిల్లలకు సంబంధించిన సమస్త వివరాలు దీనిలో ఫీడ్‌ చేస్తే... ఆ తర్వాత వారు ఇంజనీరింగ్‌లో చదివేటప్పుడు ఇక మరోసారి సర్టిఫికెట్లు అన్నీ సమర్పించనక్కర్లేదు. సీఎల్‌జీఎస్‌ నుంచే విద్యాసంస్థలకు వెళ్లిపోతాయి.

ముందుగానే చెప్తుంది
‘మై ఏపీ పోర్టల్‌’లో ప్రజలు అడిగిన సేవలు అందించడమే కాకుండా... ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ తెలిపే ఏర్పాట్లు ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఈ సేవలు ఉన్నాయి.. కావాల్సివస్తే పొందవచ్చు; ఈ పథకాలు ఉన్నాయి.. అర్హులైతే చేరవచ్చు... అన్న సమాచారం అందిస్తుంది. రాష్ట్రంలో ఉన్న డ్రైవింగ్‌ లైసెన్సుదారులు ఎవరు? వారివి ఎప్పటివరకూ చెల్లుతాయి? అనే సమాచారం మొత్తం ఉంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోవాలంటూ కొంచెం ముందే ఈ పోర్టల్‌ ద్వారా సమాచారం వస్తుంది.

ఆధార్‌ కార్డే తాళం
‘మై ఏపీ పోర్టల్‌’లో ఏ సేవ పొందాలన్నా ఆధార్‌కార్డ్‌ ఉండాలి. ఆధార్‌ నంబరు ఎంటర్‌ చేస్తే అందుబాటులో ఉన్న అన్ని సేవలు కనిపిస్తాయి. కావాల్సిన సేవను ఎంచుకుని దరఖాస్తు చేస్తే... ఆ సేవ అందేవరకూ ప్రక్రియ అంతా అందులోనే నడుస్తుంది.

యాప్‌స్టోర్‌.. ప్రజలూ పెట్టొచ్చు
రాష్ట్ర ప్రభుత్వమే ఒక ప్రత్యేక యాప్‌స్టోర్‌ను ప్రారంభించింది. నకిలీ యాప్‌లు కాకుండా ప్రభుత్వం ధ్రువీకరించిన యాప్‌లు ఇందులో ఉంటాయి. అన్ని ప్రభుత్వ శాఖల యాప్‌లు దీనిలో పెడతారు.
Tags