Type Here to Get Search Results !

అన్నంపై కన్నేశారు…!

అన్నంపై కన్నేశారు…! 

దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలి. మనకు అనుకూలురు ఉన్నప్పుడే నిబంధనలనుసైతం మార్చేసుకుని కోట్లాది రూపాయలను వెనుకేసుకునే పనిలో ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయ సంస్థ ఉన్నతాధికారులు నిమగమయ్యారు. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే గురుకులాల హాస్టళ్లకు బియ్యం, కూరగాయలు, చికెన్‌, గుడ్లు తదితర నిత్యావసర వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్ట్‌పై ఆయా శాఖల అధికారులు కన్నేశారు. కాసుల వర్షం కురిపించే కాంట్రాక్ట్‌ను తమ అనుంగులకు ఇప్పించేందుకు వీలుగా నిబంధనలనుసైతం మార్చేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులనుసైతం భాగస్వామ్యం చేసి వారికీ ఎంతో కొంత ప్రతిఫలం చూపిస్తామంటూ ఆశ కలిపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఎంపిక చేసే కాంట్రాక్ట్‌ విధానానికి స్వస్తి పలికి, ఆయా శాఖలే ఒక్కో జిల్లాకు ఒక్కో కాంట్రాక్టర్‌ను నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికారులే పాత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో 189 గురుకుల పాఠశాలలు, 296 కళాశాల వసతి గహాలు, 985 ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో 179 గురుకుల పాఠశాలలు, 156 పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు, 391 ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయి. మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్‌ వెనకబడిన తరగతుల శాఖ కింద 43 గురుకుల పాఠశాలలు, రెండు జూనియర్‌ కళాశాలల్లో విద్యా బోధన జరుగుతోంది. మొత్తంగా సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల కింద 2,196 విద్యా సంస్థలు ఉండగా, వెనకబడిన తరగతులశాఖ నిర్వహణలో మరో 45 విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సీఎం చంద్ర బాబు గురుకులాల విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించేందుకు మెనూ కూడా మార్చారు. కాని మార్చిన మెనూ ఇప్పటికి సక్రమంగా అమలు కావడం లేదు. కోడి కూర, కోడిగుడ్లు సక్రమంగా అందటంలేదనే విమర్శలు లేకపోలేదు. గురుకులాలు, వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులందరికీ భోజనం సరఫరా చేసేందుకు ప్రత్యేక వ్యవస్థని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇపుడు ఆ వ్యవస్థనే సమూలంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం.

ఫలితాలు, అభివృద్ధి పూజ్యం

గురుకుల విద్యాసంస్థలలో ఆశించిన ఫలితాలు రావటంలేదు. చివరకు అభివృద్ధి కూడా కుంటుపడుతోంది. అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా, నంబంధిత మంత్రులుసైతం నోరు మెదపకపోవటంతో గురుకుల విద్యాలయ సంస్థలు అవినీతికి నెలవుగా మారాయి. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిపై ఇటీవల వచ్చిన పలు ఆరోపణలపై సాగుతున్న విచారణే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పలు గురుకులాల్లో అవినీతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. పేద విద్యార్థుల అభ్యున్నతిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంటే, కిందిస్థాయి అధికారులు మాత్రం తమ సొంత ఖాతాల్లోకి నిధులను ఎలా మళ్లించుకోవాలోనన్న రీతిలో వ్యవహరిస్తున్నారనే ఆరపణలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నీ కాంట్రాక్టర్‌ ద్వారానే…

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల హాస్టళ్లల్లోని విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే సమకూరుస్తోంది. పౌరసరఫరాలశాఖ ద్వారా బియ్యం సరఫరా అవుతుండగా, గుడ్లు, కూరగాయలు వంటి వస్తువుల సరఫరా కోసం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తారు. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఆయా వస్తువులను సరఫరా చేస్తారు. ఇక్కడే సాంఘిక సంక్షేమశాఖ అధికారుల కళ్లు సంపాదనపై పడ్డాయి. 13 జిల్లాల్లోని గురుకులాలకు ఒకే కాంట్రాక్టర్‌ను తామే నియమించాలనే ఆలోచన చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే కాంట్రాక్టర్‌ కూరగాయలు, బియ్యం, గుడ్లు, చికెన్‌ తదితర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా జిల్లాల్లో నాలుగైదు చిన్న గురుకులాలకు ఒక కాంట్రాక్టర్‌ నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తుంటారు. దీనివల్ల తమకు ఉపయోగం ఉండటంలేదనే ఉద్దేశంతోనే కొందరు అధికారులు ఒకే కాంట్రాక్టర్‌ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సూత్రధారిపై ఆరోపణలెన్నో…

కోట్లాది రూపాయల విలువైన ఆహార సరఫరా కాంట్రాక్ట్‌ విధనాన్ని అమలు చేయాలనే ఆలోచన వెనుక తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఉన్నతాధికారి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. సాంఘిక సంక్షేమశాఖలో పలు ఆరోపణలు రావటంతో ఏకంగా ఎస్సీ కమిషన్‌ విచారణను ఆయన ఎదుర్కొంటున్నారు. అలాంటి అవినీతి అధికారి డైరెక్షన్‌లోనే సాంఘిక సంక్షేమశాఖ మొత్తం నడుస్తుండటం గమనార్హం. ఒక్కో జిల్లా కాంట్రాక్ట్‌ను ఒక్కరికే అప్పగించటం వల్ల తామూ ఒక రూపాయి వెనుకేసుకోవచ్చనే రీతిలో ఆ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి అధికారుల ఉచ్చులో చివరకు ప్రజా ప్రతినిధులు కూడా పడ్డారంటే, ఫుడ్‌ కాంట్రాక్టర్‌ నుంచి ఏ మేర కమీషన్లు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
విద్యార్థుల సంక్షేమం, విద్యపై దృష్టి సారించాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులుసైతం కాంట్రాక్ట్‌ వ్యవస్థను తమ చెతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం. ఇదిలావుండగా, కాసులు కురిపించే ఫుడ్‌ కాంట్రాక్ట్‌ విధానంపై సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబుతో చర్చించి మరీ విధానపరమైన నిర్ణయం తీసుకునేలా కొందరు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో మంత్రివర్యులు ఎలాంటి విధానపరమైన నిర్ణయానికి మొగ్గు చూపుతారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు
Tags