Type Here to Get Search Results !

విద్యా వ్యవస్థకే ముప్పు - ఏచూరి

విద్యా వ్యవస్థకే ముప్పు - ఉన్నత విద్యా కమిషన్‌ బిల్లుపై ఏచూరి*

  • పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తాం
  • జాతీయ స్థాయిలో ఉమ్మడి వేదిక ఏర్పాటు
🌻యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఉన్నత విద్యాకమిషన్‌ విద్యావ్యవస్థకు పెనుముప్పుగా మారనుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఈ మేరకు రూపొందించిన ఉన్నత విద్యా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఇసిఐ) బిల్లులో దిగ్భ్రాంతికర విషయయాలున్నాయని ఆయన చెప్పారు. ఈ బల్లును వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు ఏచూరి గురువారం లేఖ రాశారు. అనంతరం సిపిఎం ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పొలిట్‌ బ్యూరో సభ్యులు నిలోత్పల్‌ బసుతో కలిసి సీతారాం ఏచూరి మాట్లాడారు. భారత విద్యావ్యవస్థను సర్వనాశనం చేసే ఈ బిల్లును పార్లమెంటులో సిపిఎం వ్యతిరేకిస్తుంద ని, తమతో పాటు, అనేక ఇతర పక్షాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.
🌻 ఈ బిల్లును వ్యతిరేకించేందుకు జాతీయ స్థాయిలో ఉమ్మడి వేదిక ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే డిఎంకె, ఎస్పీ, ఎన్సీపి, ఆర్జేడి, జెడిఎస్‌ వంటి పార్టీలు ఒకే వేదికపై ఉద్యమించేందుకు ముందుకు వచ్చాయని, మరిన్ని పార్టీలు తమతో భాగస్వామ్యం కానున్నాయని తెలిపారు. ఉన్నత విద్య భవిష్యత్‌ కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని ఏచూరి పిలుపునిచ్చారు.. ప్రజలు, మేథావులు, విద్యార్థులు, అధ్యాపకులతో చర్చించకుండా ఏకపక్షంగా ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉన్నత విద్యా, పరిశోధన సంస్థలపై దాడులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.
🌻 కొంత మంది విద్యార్థులు, అధ్యాపకులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం తో వర్శిటీల్లో ప్రజాస్వామిక చర్చ జరిగే సంస్కృతిని దెబ్బతీస్తన్నారని విమర్శించారు. విద్యా విషయ, మేథో స్వయం ప్రతిపత్తికి అధికారికంగా సవాళ్లు సృష్టించడం, శాస్త్రీయ, చారిత్రక వాస్తవాలకు వ్యతిరేకంగా మూఢ నమ్మకాలను, విశ్వాసాలను ప్రోత్సహించడం ఈ దాడిలో ఒకభాగమని చెప్పారు. ఈ దాడిలో భాగంగా యుజిసికి నిధులు కేటాయింపు తగ్గించడంతో ఎంఫిల్‌, పిహెచ్‌డి చేసే వారికి ఇచ్చే రుణాలు, ఫెలో షిప్పులు తగ్గిపోయాయని చెప్పారు. పరిశోధనా కార్యక్రమాలు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది శాశ్వత నియామకాలు ఆగిపోయాయని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న ఉన్నత విద్యా సంస్కరణలు దేశంలో ఉన్నత విద్య పునాదులను నాశనం చేసేవిధంగా ఉన్నాయని అన్నారు.
🌻పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టబోయే హెచ్‌ఈసిఐ(1956 యుజిసి చట్టం రిపీల్‌)-2018 డ్రాఫ్ట్‌ బిల్లులో విద్యా ప్రైవేటీకరణ, సామాజిక మినహాయింపు (రిజర్వేషన్ల పట్ల వివక్షత) అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు, విద్యా వేత్తలు, మేథావులు, ప్రజా సంఘాలతో కలిసి సిపిఎం విస్తృత పోరాటం సాగిస్తుందన్నారు. భవిష్యత్‌ భారత దేశం కోసం ఉద్యమించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పారు. మేథావులను తయారు చేసే ఉన్నత విద్య ప్రమాదంలో పడిందని విమర్శించారు.
🌻 1956లో యుజిసి చట్టం ఏర్పడినప్పుడు 27 యూనివర్శిటీలు ఉన్నాయని, ప్రస్తుతం 850 యూనివర్శిటీలు ఉన్నాయని, అందువల్లనే యుజిసి స్థానంలో కమిషన్‌ తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్పడం వాస్తవాలను దాచిపెట్టడమేనని అన్నారు. విద్య కాషాయికరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ చేసే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించిందని తెలిపారు. 2005లో తీసుకొచ్చిన ప్రైవేట్‌ యూనివర్శిటీ బిల్లుతో దేశంలో అనేక ప్రైవేట్‌ సంస్థలు తిష్ట వేశాయని చెప్పారు. డబ్ల్యుటిఓ ఆదేశాల మేరకు విద్యను సేవగా కాకుండా వస్తువుగా మార్చుతున్నారన్నారు. ఇది రాజ్యాంగ నిర్ధేశానికి వ్యతిరేకమని చెప్పారు. విద్య కేంద్రీకరణ వల్ల రాష్ట్రాల హక్కులు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
🌻ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న 850 యూనివర్శిటీల్లో 384 వర్శిటీలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని, ప్రతిపాదిత బిల్లుతో ఆ యూనివర్శిటీలన్నీ కమిషన్‌ పరిధిలోకి వెడతాయని వివరించారు. దీనర్ధం మొత్తం యూనివర్సిటీలన్నీ కేంద్ర ప్రభుత్వ చేతుల్లోకి వెళ్లడమేనని ఫలితంగా సమాఖ్య వ్యవస్థపై దాడి జరుగుతుందని విమర్శించారు. విద్యా విధానాన్ని పూర్తిగా కాషాయికరణ చేయాలన్న బిజెపి, ఆరెస్సెస్‌లు కుట్ర దీనివెనుక ఉందన్నారు. లౌకిక దేశం స్థానంలో హిందూ రాష్ట్రం నిర్మించాలని, భారత చరిత్ర స్థానంలో హిందూ మైథాలజీ, తత్వశాస్త్రం స్థానంలో హిందూ థియోలజీని భోదించాలని ఆరెస్సెస్‌, బిజెపిలు నిర్ణయించాయని అన్నారు. అందుకనుగుణంగానే ప్రధాన మంత్రి నుంచి కేంద్ర మంత్రులు, ఇతర బిజెపి నేతల వరకు రామాయణం, మహాభారతం గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. శాస్త్రీయతకు పెట్టింది పేరైన భారతీయ విద్యను అశాస్త్రీయ భావాలతో కూడిన కాషాయ భావజాలంతో నింపివేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమే ఈ బిల్లు అని ఏచూరి విమర్శించారు.
🌻 హిందూత్వ ఎజెండాను అమలు చేయాలని కృతనిశ్చయంతో మోడీ సర్కార్‌ ఉందని అన్నారు. హిందూత్వం అనేది మతానికి సంబంధించినది కాదని, బిజెపి, ఆరెస్సెస్‌ల రాజకీయ ఎజెండా అని అన్నారు. ఈ బిల్లు వల్ల పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్య లభించదని, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అందని ద్రాక్ష అవుతుందని విమర్శించారు.


*👉ప్రధానికి లేఖలోని ముఖ్యాంశాలు👇*
- ముసాయిదా బిల్లులో అందరికీ సమాన అవకాశాలు, రిజర్వేషన్ల ఊసే లేదు. ఫలితంగా మహిళలు, దళితులు, ఆదివాసీలు, బిసీలు, మైనార్టీలు, వికలాంగుల విద్యా ప్రయోజనాలు దెబ్బతింటాయి.
- అధికారయంత్రాంగానికి అపరిమిత అధికా రాలు కల్పించడం, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఒకే రకమైన నిబంధనలు రూపొందించడం హానికరంగా మారుతుంది.
- సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్న ప్రభుత్వ విద్యాసంస్థల కూడా ప్రైవేటు విద్యాసంస్థల మాదిరే వనరులను సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. ఇది వ్యాపారీకరణే!
- నియంత్రణ చర్యలతో సృజనాత్మకత, మేథో వికాసం ధ్వంసమౌతాయి.
- విద్యాసంస్థలను మూసివేసే అధికారాన్ని కమిషన్‌కు కట్టబెట్టడం తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది.
- సిలబస్‌లో భిన్నత్వాన్ని బిల్లు నిరాకరిస్తోంది. ఉపాధి కోర్సుల పేరిట ఉన్నత విద్య లక్ష్యమైన మేథో వికాసాన్ని దెబ్బతీస్తోంది. ఇది భవిప్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Tags