ఆండ్రాయిడ్ స్థానంలో కొత్త ఓఎస్ ఫ్యూషా
- అందుబాటులోకి రానున్న కొత్త ఆపరేటింగ్ వ్యవస్థ ఫ్యూషా!
- కొత్త ఓఎస్‌ను రూపొందిస్తున్న గూగుల్
- బహుళ సాధనాలకు ఒకే సాఫ్ట్‌వేర్
- అనేక అదనపు హంగులకూ శ్రీకారం
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్లకు ప్రాణాధారమైన ‘ఆండ్రాయిడ్’ స్థానంలో కొత్త ఆపరేటింగ్ వ్యవస్థ (ఓఎస్) రాబోతోంది. ఇందుకోసం దాదాపు రెండేళ్లుగా ‘గూగుల్’కు చెందిన ఒక చిన్న బృందం గోప్యంగా కసరత్తు చేసింది. ఇప్పుడు వందమందికిపైగా ఇంజినీర్లు దీనిపై పనిచేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ వాచీలు తదితర బహుళ సాధనాలకు ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుందన్న దానిపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.
ఈ ప్రాజెక్టుకు ‘ఫ్యూషా’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం అనేక ఎలక్ట్రానిక్ సాధనాలు ఆన్‌లైన్‌తో అనుసంధానమవుతున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్‌లోని లోపాలను సరిదిద్దాలన్నది దీని లక్ష్యం. స్వర నిర్దేశాలు, తరచూ భద్రతాపరమైన అప్‌డేట్‌లు చేసుకోవడానికి, లాప్‌టాప్‌ల నుంచి.. ఇంటర్నెట్ సంధానిత బుల్లి సెన్సర్ల వరకూ అన్ని సాధనాల అవసరాలు తీర్చేలా దీనికి రూపకల్పన చేస్తున్నారు. గూగుల్‌కు చెందిన క్రోమ్ ఓఎస్‌కూ దీన్ని ప్రత్యామ్నాయం చేయాలనుకుంటోంది. కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్‌పై గూగుల్ ఇప్పటికే ఎక్కువ దృష్టి పెట్టింది. అందువల్ల ఏఐ సేవల కోసం ఒకే ఓఎస్‌ను సృష్టించడం వల్ల పురోగతి సాధించొచ్చని ఆ సంస్థ భావిస్తోంది. ఫ్యూషాలో స్వర నిర్దేశాలే కీలకం కానున్నాయి. వివిధ రకాల తెరల పరిమాణానికి సరిపోయేలా డిజైన్ చేస్తున్నారు. గూగుల్ తన సాఫ్ట్‌వేర్‌ను కొత్తగా వ్యాప్తి చేస్తున్న టీవీలు, కార్లు, ఫ్రిజ్‌లకు సరిపోయేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఐదేళ్లలో..
ఫ్యూషాను మూడేళ్లలో తొలుత స్వర నియంత్రిత స్పీకర్లు వంటి అంతర్జాల సంధానిత ఉపకరణాల్లో అమర్చాలని గూగుల్ భావిస్తోంది. ఆ తర్వాత లాప్‌టాప్ వంటి పెద్ద సాధనాల వైపు మళ్లాలనుకుంటోంది. అంతిమంగా ఆండ్రాయిడ్ స్థానంలో దీన్ని పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టాలనుకుంటోంది. వచ్చే ఐదేళ్లలో దీన్ని సాకారం చేయాలనుకుంటోంది. అయితే ఈ కాలావధిపై సంస్థ అధినాయకత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

అందరికీ అప్‌డేట్..
స్మార్ట్‌ఫోన్ రంగంలో గూగుల్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన యాపిల్ సంస్థతో మరింత మెరుగ్గా పోటీ పడటం ఫ్యూషా ప్రాజెక్టు లక్ష్యం. మార్కెట్‌లో ఆండ్రాయిడ్ వాటా 85 శాతం. యాపిల్‌కు 15 శాతం వాటా ఉంది. పనితీరు, గోప్యత, భద్రత, ఇతర యాపిల్ ఉత్పత్తులతో సంధానత వంటి అంశాల్లో యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు పైచేయి ఉంది. యాపిల్ రూపొందించిన ఐఫోన్‌ను ఉపయోగించేవారిలో ఎక్కువ మంది.. ఓఎస్‌కు సంబంధించిన కొత్త వెర్షన్ వచ్చిన వెంటనే అప్‌డేట్ చేసుకోగలుగుతున్నారు. ఆండ్రాయిడ్‌ను ఉపయోగించేవారిలో 10 శాతం కన్నా తక్కువ మందే అలా చేసుకోగలుగుతున్నారు. ఇలాంటి అనేక ఇబ్బంద్దులను అధిగమించడానికి ఇప్పుడు మార్గం ఏర్పడింది. నిజానికి కొత్త వెర్షన్ అప్‌డేట్ విషయంలో గూగుల్ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఏటా అనేకసార్లు ‘సెక్యూరిటీ ప్యాచ్‌ల’ ద్వారా తమ సాధనాలను అప్‌డేట్ చేసేలా మొబైల్ కంపెనీలతో కుదిరిన తన ఒప్పందంలో మార్పులు చేసింది. ఫ్యూషాలో ఇంకా గట్టి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అంత సులువు కాదు..
ఆండ్రాయిడ్‌లో సమూల మార్పుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కంపెనీ అధినాయకత్వం జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే గూగుల్‌కు సంబంధించిన హార్డ్‌వేర్ భాగస్వాములకు ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేరే ఆధారం. మొబైల్ ఫోన్లలో ప్రకటనల ద్వారా వచ్చే వందల కోట్ల డాలర్లు వంటివి ఓఎస్‌తో ముడిపడి ఉన్నాయి. అనేక పాఠశాలలు, సంస్థలు ఉపయోగించే వెబ్ ఆధారిత ల్యాప్‌టాప్‌లకు క్రోమ్ ఓఎస్ చాలా ముఖ్యం. అందువల్ల ఆండ్రాయిడ్, క్రోమ్ ఓఎస్‌కు మద్దతును ఆపేసి, వేగంగా వ్యవస్థ మొత్తాన్నీ ఫ్యూషాకు మళ్లించడం గూగుల్‌కు అంత సులువు కాదని చెబుతున్నారు. అండ్రాయిడ్ వల్ల కంపెనీకి నియంత్రణ, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తాయి. తన సేవల వ్యాప్తికి మొబైల్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నందుకు ఐరోపా నియంత్రణ సంస్థ.. గూగుల్‌కు రికార్డు స్థాయిలో 500 కోట్ల డాలర్ల జరిమానాను విధించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌లో జరిగే మార్పులపై నిశిత దృష్టి ఉంటుంది. వ్యక్తిగత గోప్యత అంశాల విషయంలో ఎలా డిజైన్ చేయాలన్న అంశంపై కంపెనీ మల్లగుల్లాలు పడుతోంది