కోర్టు ధిక్కరణను సహించం
1998 డీఎస్సీ మెరిట్ జాబితా ప్రకటనపై ఇంత నిర్లక్ష్యమా?
వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ విద్యాశాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
డీఎస్సీ(1998)లోని అక్రమాలను సరిదిద్ది తాజాగా మెరిట్ జాబితాను ప్రకటించాలంటూ 2009లో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై ఉమ్మడి హైకోర్టు సోమవారం తెలంగాణ విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మెరిట్ జాబితాను ప్రకటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. డీఎస్సీ 1998లో అక్రమాలు జరిగాయంటూ కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా సవరించి మెరిట్ జాబితాను ప్రకటించాలంటూ 2009లో ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పి.నవీన్‌రావు.. కోర్టు ఉత్తర్వులు అమలుచేయకుంటే జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వచ్చే విచారణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేశారు.