Type Here to Get Search Results !

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలు దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలు దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!
Dec 10, 2021, 21:27 IST








ఎలక్ట్రిక్‌ వాహనాలకు సర్కారు సబ్సిడీ

టీఎస్‌ రెడ్‌కో ఎండీ ఎన్‌.జానయ్య వెల్లడి


హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలో వాట్‌కు రూ.15 వేల చొప్పున సబ్సిడీని ప్రభుత్వం అందించనుందని రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్‌కో) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.జానయ్య వెల్లడించారు. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్‌ వీలర్‌ తేడా లేకుండా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని చెప్పారు. రూ.10 లక్షల విలువైన వాహనాల వరకూ సబ్సిడీ ఉంటుందన్నారు.


గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో నగరంలో నెక్లెస్‌ రోడ్డు లోని పీపుల్స్‌ ప్లాజాలో ‘గో ఎలక్ట్రిక్‌’పేరుతో రోడ్‌ షో నిర్వహించనున్నామని తెలిపారు. రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలు, రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలు విలువ చేసే ఆటోలు, రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల విలువ చేసే కార్లను ఈ రోడ్‌ షోలో ప్రదర్శనకు ఉంచనున్నామన్నారు. 60 స్టాల్స్, చార్జింగ్‌ పాయింట్లు ప్రదర్శనకు ఉంటాయని చెప్పారు.

హైదరాబాద్‌లో మరో 118 చార్జింగ్‌ స్టేషన్లు
కాలుష్య నిర్మూలనలో భాగంగా నగరంలో 15 ఏళ్లు నిండిన ఆటోలను రెట్రోఫిట్‌మెంట్‌ ద్వారా బ్యాటరీలతో నడిచేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేస్తున్నామని జానయ్య చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో 65 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో మరో 118, కరీంనగర్, వరంగల్‌లో 10 చొప్పున చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. పెట్రోల్‌ బంకుల్లో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు. ప్రైవేటు వ్యక్తులు స్థలాలు లీజుకు ఇస్తే చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి వచ్చే ఆదాయంలో వాటా ఇస్తామని చెప్పారు.