Type Here to Get Search Results !

UGC New Norms Two Degrees at a Time ఒకేసారి రెండు డిగ్రీలకు చాన్స్‌

విద్యార్థులకు యూజీసీ వెసులుబాటు 2022-23 విద్యా సంవత్సరం నుంచే
విద్యార్థులకు యూజీసీ వెసులుబాటు
2022-23 విద్యా సంవత్సరం నుంచే

UGC New Norms Two Degrees at a Time ఒకేసారి రెండు డిగ్రీలకు చాన్స్‌

న్యూస్ అలర్ట్స్ , ఏప్రిల్‌ 12 : డిగ్రీ కోర్సులకు సంబంధించి ఓ నూతన విద్యావిధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రత్యక్ష తరగతులకు హాజరవుతూ ఒకేసారి రెండు డిగ్రీ(ఫుల్‌టైమ్‌)లు పూర్తి చేసేందుకు పచ్చజెండా ఊపింది. తొలిసారిగా అమలు చేయనున్న ఈ విధానంలో విద్యార్థులు ఒకేచోట లేదా వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో డిగ్రీలు పూర్తి చేయవచ్చు. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) చైర్మన్‌ జగదీష్‌ కుమార్‌ మంగళవారం ఓ ప్రకటన చేశారు. నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న విధంగా విద్యార్థులు రకరకాల నైపుణ్యాలు నేర్చుకునేందుకు వీలుగా ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. దీని వల్ల ఓ విద్యార్థి ఒకేసారి బీ కామ్‌తోపాటు గణితంలో డిగ్రీ పూర్తి చేయవచ్చునని తెలిపారు. ఉన్నత విద్య విషయంలో భారతీయ విద్యార్థులకు దక్కిన ఈ అవకాశం ప్రపంచంలో వేరే చోట లేదని ఆయన వెల్లడించారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానున్న ఈ కొత్త విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు అతి త్వరలో విడుదల కానున్నాయి. నిజానికి, ఓ విద్యార్థి ఒకే సారి రెండు డిగ్రీ(ఫుల్‌టైమ్‌)లు చేసేందుకు యూజీసీ ఇన్నాళ్లూ అనుమతినిచ్చే కాదు. డిగ్రీకి అనుబంధంగా ఏదైనా డిప్లొమో లేదా షార్ట్‌టర్మ్‌ కోర్సులు చేసేందుకే అవకాశముండేది.
కొత్త పద్ధతి ప్రకారం ఓ విద్యార్థి తన ఆసక్తికి అనుగుణంగా ఒకేసారి రెండు వేర్వేరు డిగ్రీలు లేదా రెండు పీజీలు లేదా రెండు డిప్లొమో కోర్సులు చేయవచ్చు. ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూజీసీ మూడు విధానాలను సూచిస్తుంది. రెండు డిగ్రీలను ప్రత్యక్ష తరగతులకు హాజరై పూర్తి చేయడం ఇందులో మొదటిది. ఈ సందర్భంలో ఆయా కోర్సుల తరగతులు ఒకే సమయంలో ఉండకుండా చూసుకోవడం తప్పనిసరి. ఇక, ప్రత్యక్ష తరగుతులకు హాజరవుతు ఒక డిగ్రీ, ఆన్‌లైన్‌ లేదా దూరవిద్య ద్వారా మరో డిగ్రీని పూర్తి చేయడం రెండో విధానం. రెండు డిగ్రీలను ఆన్‌లైన్‌ లేదా దూరవిద్య ద్వారా పూర్తి చేయడం మూడో విధానం. అయితే, ఈ రెండు డిగ్రీల విధానాన్ని అమలు చేయడంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పూర్తిగా విశ్వవిద్యాలయాలకే అప్పగిస్తున్నారు. ఒకేసారి రెండు డిగ్రీలు చేసే విద్యార్థులకు సంబంధించిన ప్రవేశాలు, హాజరు, పరీక్షలకు సంబంధించిన ప్రక్రియను ఆయా వర్సిటీలు, కళాశాలలే నిర్ణయిస్తాయి. కాగా, ఏకకాలంలో రెండు డిగ్రీలు పూర్తి చేసే విధానంపై పలువురు విద్యావేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయని అభిప్రాయపడ్డారు. ఈ కొత్త విధానాన్ని చూస్తుంటే యూజీసీ విద్యార్థులను సూపర్‌ హ్యుమన్‌లుగా భావిస్తున్నట్టుగా ఉందని ఓ అధ్యాపకుడు విమర్శించారు.