టీచర్ల బదిలీలకు సంబంధించి వివాదాస్పదంగా మారిన జీవో 402ని హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంపై వివరణ సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
టీచర్ల మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్ వివాదం తెలంగాణ జీవో 402ను సస్పెండ్ చేసిన హైకోర్టు
టీచర్ల బదిలీల వివాదంలో కేసీఆర్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. బదిలీలకు సంబంధించి వివాదాస్పదంగా మారిన జీవో 402ని హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో పరస్పర బదిలీలు (మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్) చేసుకునే ఉపాధ్యాయులు సీనియారిటీ కోల్పోకుండా బదిలీ అయ్యే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 402 అమలును న్యాయస్థానం నిలుపుదల చేసింది. జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం సోమవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
అయితే జీవో 402 వల్ల తాము నష్టపోతామంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన పలువురు సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... నూతన ప్రెసిడెన్షియల్ రూల్స్ ప్రకారం పరస్పర బదిలీలకు అవకాశం ఉందని, అయితే ఇలా చేసుకునేవారు పాత జిల్లాలో తమకున్న సీనియారిటీని కోల్పోయి కొత్త జిల్లా క్యాడర్‌లో చివరి ర్యాంకు నుంచి సర్వీసును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్ కీలక నిర్ణయాన్ని వెలువరించింది.