రాష్ట్రంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ కేటగిరీలకు సంబంధించిన ఉపాధ్యాయులకు చేపట్టిన అంతర్ జిల్లా బదిలీలకు సంబంధించిన ఫైల్ ఈరోజు సాధారణ పరిపాలన శాఖకు చేరిందని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సాబ్జీ మరియు ఏపీటీఎఫ్ 1938 ప్రధాoన కార్యదర్శి హృదయ రాజు అంతర్జిల్లా బదిలీలు సాధన సమితి ఉపాధ్యాయులకు తెలిపారు. పదిహేను రోజుల్లోఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని సాబ్జీ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం అక్రమ బదిలీలకు తెర లేపుతున్నందున మరియు అపరిష్కృత ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉపాధ్యాయులు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని హృదయ రాజు తెలిపారు.
✍టీచర్ల ‘సర్కారీ బదిలీలు✍📚*
*♦మంత్రుల సిఫారసులతో ఉత్తర్వులు*
*♦నిషేధం ఉన్నా అడ్డురాని నిబంధనలు*
*♦పైరవీలతో వేగంగా కదులుతున్న ఫైళ్లు*
*♦ఉపాధ్యాయ సంఘాల ఆందోళన*
*♦నెల్లూరు జిల్లాలో ఒక మంత్రి సిఫారసుపై*
*10 మంది జడ్పీ టీచర్లు మున్సిపల్ స్కూళ్లకు బదిలీ!*
🌻అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఉంది విద్యాశాఖలోని పనితీరు. ఒకవైపు బదిలీలపై నిషేధం కొనసాగుతుంటే.. మరోవైపు టీచర్ల బదిలీకి ఉత్తర్వులు విడుదలవుతున్నాయి.
🌻 వాస్తవానికి ఈ ఏడాది మే 4 నుంచి జూన్ 4 వరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలించిన ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు బదిలీలు లేవని స్పష్టం చేసిందని. కానీ, మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫారసులతో జిల్లాల్లో టీచర్ల బదిలీలు జరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఓ మంత్రి సిఫారసుపై 10 మంది జిల్లా పరిషత్ పాఠశాల టీచర్లను మున్సిపల్ పాఠశాలలకు బదిలీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని పలువురు ప్రశ్నిస్తున్నారు.
🌻 గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇలాంటివి అఽధిక సంఖ్యలో జరిగినట్లు తెలుస్తోంది. ఆరోగ్య, కుటుంబ సమస్యలతో చేసుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తూ.. పైరవీలు, సిఫారసులు చేసుకున్న వారికి పనులు ఆగమేఘాల మీద జరగటం కలకలం రేపుతోంది. కౌన్సెలింగ్ ఊసు లేకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.
🌻ఒకేసారిగా కాకుండా.. ఒక్కొక్కటిగా టీచర్ల బదిలీల ఉత్తర్వులు విడుదలవుతున్నాయని చెబుతున్నారు. ఉన్నతస్థాయి నుంచి పాఠశాల విద్యాశాఖకు.. ఫలాన టీచర్ల బదిలీకి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలంటూ నేరుగా ఆదేశాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. మున్సిపాలిటీలు, అంతర్‌జిల్లా బదిలీల కోసం ఉపాధ్యాయులు చేసుకున్న దరఖాస్తులపై ఉత్తర్వులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ.. కొత్త పోకడలకు దిగడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై పాఠశాల విద్యాశాఖ వర్గాలను వివరణ కోరగా ప్రభుత్వ విచక్షణతో బదిలీలు జరుగుతున్న మాట వాస్తవమేనని చెబుతున్నాయి.
యుజిసి రద్దయితే ఉన్నత విద్యకు గండమే*_
*♦- విద్యావేత్తల అభిప్రాయాలు*
🌻యూనివర్శిట్సీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) రద్దుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల పట్ల పలువురు విద్యావేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కమిషన్‌ను రద్దు చేసి కొత్తగా ఉన్నత విద్య కమిషన్‌ను ఏర్పాటు చేసి దానికి ఆర్థికయేతర విధులను మాత్రమే అప్పగించి మిగిలిన విషయాలను మానవ వనరుల శాఖ ద్వారా పెత్తనం చెలాయించడానికి నూతన ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. దీనిపై అభిప్రాయాలను పదిరోజుల్లోగా తెలపాలని కేంద్ర మానవ వనరుల శాఖ బహిరంగంగా కోరింది. యుజిసి చట్టం-1951ని రద్దు చేసి భారత ఉన్నత విద్యా కమిషన్(హెచ్‌ఈసీఐ) చట్టం -2018 పేరుతో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు పెట్టే అవకాశం ఉంది. విద్యా ప్రమాణాలను ఉల్లంఘించే సంస్థల పనితీరును సమీక్షించి తగిన చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుందనే ఉద్ధేశ్యంతో తీసుకొస్తున్న ఈ కొత్త చట్టం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
*♦- విద్య కాషాయీకరణకే...*
ఉన్నత విద్యావ్యవస్థను రాజకీయ నాయకుల గుప్పెట్లో పెట్టుకోవడం కోసమే ప్రభుత్వం ఉన్నత విద్యా కమిషన్‌ను తెరపైకి తెస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తి గల యుజిసి రద్దయితే రాజకీయ ప్రమేయం పెరుగుతుంది. విద్యా వ్యవస్థపై రాజకీయ పెత్తందారీతనం పెరుగుతుంది. ఆదిపత్యం చెలాయించడానికే ప్రభుత్వం యుజిసిని రద్దు యోచన చేస్తుంది. అంతర్గతంగా బిజెపి విద్యా వ్యవస్థను కాషాయీకరణ చేయడానికి ప్రయత్నిస్తోంది. యుజిసిలో ఉన్న లోపాలను సరి చేస్తే సరిపోతుంది. ఇందిరాగాంధీ సమయంలో యుజిసిలో అవకతవకలు జరిగాయంటే ఆనాడు ఎయులో పనిచేసిన ఆచార్య బి.ఆర్.రావుతో విచారణ చేయించి సరిచేయించారు. ఉన్నత విద్యా వ్యవస్థలు మేధావుల నిర్వహణలోనే ఉండాలి. యుజిసి ఆనాడు పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన చట్టబద్దమైనది. దాన్ని అబాలిష్ చేయడం సరికాదు. మెడికల్ కౌన్సిల్‌ను కూడా మార్చి మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇటువంటివి విద్యా వ్యవస్థలకు మేలు చేయలేవు.
*-ఆచార్య కె.వి.రమణ, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి*
*♦- రాష్ట్రాలు అధికారాలను కోల్పోతాయి*
గత యుపిఎ ప్రభుత్వం యుజిసిని రద్దు చేసి ఉన్నత విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే దానిని అమలు చేయలేకపోయింది. ఇప్పుడు ఎన్‌డిఎ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దీనిని ఏర్పాటు చేయడం వల్ల విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు నిధులు వచ్చే అవకాశం ఉండదు. అది కేవలం నిబంధనలను మాత్రమే సూచిస్తుంది. ఇప్పటికే ఉన్నత విద్యకు సంబంధించి ఎన్‌సిటిఇ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్), ఎఐసిటిఇ (ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే కమిషన్ వీటిని ఎలా సమన్వయం చేసుకుంటుందో ఇంకా స్పష్టత రావాలి. కమిషన్ ఏర్పాటుతో కళాశాలలకు అనుమతించే విషయంలో రాష్ట్రాలకు ఉన్న అధికారాలు తగ్గిపోతాయి. దీనిపై రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. యుజిసి రద్దుతో నిధుల మంజూరు అంశం ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ చేతిలోకి వెళుతుంది. ఈ నేపథ్యంలో ఆ మంత్రిత్వ శాఖ కూడా నిధుల మంజూరులో ఆయా రాష్ట్రాల పట్ల పక్షపాతం చూపే అవకాశం ఉంటుంది.
*-కె.వియన్నారావు, పూర్వ ఉప కులపతి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం*
*♦- గుప్పెట్లో పెట్టుకోవడానికే*
కేంద్ర ప్రభుత్వం పాత వ్యవస్థలను రద్దు చేస్తోంది. యుజిసికి పెద్ద చరిత్ర ఉంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడాలి. దీనిని రద్దు చేసి ఉన్నత విద్యను కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను పరిపుష్టిత చేయడానికి ప్రత్యేకంగా యుజిసిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉన్నత విద్యాకమిషన్ పేరుతో కేంద్రీకృతం చేయాలని చూడడం మంచి పరిణామం కాదు. యుజిసి రద్దు చేస్తే విద్యావ్యవస్థ బలహీన పడుతుంది. ఇది ప్రమాదకరం. పరిపాలనా పరంగా కష్టమవుతుంది. అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేయాలనే బిజెపి కేంద్రీకృత విధానాలనే ఇక్కడా అమలు చేస్తుంది.
*- విటపు బాలసుబ్రమణ్యం, శాసనమండలి సభ్యులు*
*♦- స్వయం ప్రతిపత్తిని హరించడానికే...*
విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని హరించడానికే కేంద్ర ప్రభుత్వం యుజిసిని రద్దు పరిచే యోచన చేస్తోంది. ర్యాంకుల పేరుతో అనుయాయులను పెంచి పోషిస్తుంది. ఉన్నత విద్యారంగంలో పైరవీలు పెరుగుతాయి. విద్యావ్యవస్థలు విద్యావేత్తల అధీనంలోనే నడపాలి. 2010లోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత విద్యా కమిషన్ యోచన చేసింది. ఆనాడే ఆ నిర్ణయాన్ని మేమంతా వ్యతిరేకించాం. దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఇదంతా ప్రపంచ బ్యాంక్ సూచనలమేరకే జరుగుతోంది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఉన్నత విద్యా కమిషన్‌ను తెరపైకి తెస్తోంది.. దీనివల్ల ఐఎఎస్‌ల చుట్టూ విద్యాసంస్థలు తిరగాల్సి వస్తుంది. రాజకీయ ప్రమేయం పెరుగుతుంది. ఉన్నత విద్యాలయాలు తమ అస్థిత్వాలను కోల్పోయే ప్రమాదముంది. ఇది అనాలోచిత నిర్ణయం మాత్రమే. బిజెపి గత అనుభవాలను చూడకుండా ఒట్టెద్దు పోకడలకు పోతుంది. ఇది విద్యావ్యవస్థకు మంచి పరిణామం కాదు.
*- కె.ఎస్.చలం, ద్రవిడ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి*
*♦- రీసెర్చ్ విద్యావిధానాన్ని బలోపేతంచేయాలి*
రీసెర్చ్ విద్యావిధానాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న యూజిసిని విభజించి ఆర్థికాంశాలు ఒక వైపు, అకాడమిక్ మరోవైపు విభజించడం ద్వారా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని యూనివర్సిటీల్లో నిధుల కోత ఉంటోంది. ఇప్పుడు ఆర్థికాంశాలన్నీ మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే యూనివర్సిటీ లు మరింత దెబ్బతినే అవకాశం ఉంది.
*-బి.అమర్‌నాథ్, రిజిస్ట్రార్, రాయలసీమ యూనివర్శిటీ, కర్నూలు*
*♦- ప్రైవేటీకరణే ప్రభుత్వ ఉద్దేశం*
ఉన్నత విద్యను ప్రైవేటీకరించడమే ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. పార్లమెంట్ చట్టం ద్వారా ప్రభుత్వం యుజిసిని ఏర్పాటు చేసింది. ఆరు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల నిర్వహణ బాధ్యతను ఇది తీసుకుంది. నూతనంగా ఉన్నత విద్య కమిషన్ ఏర్పాటుతో ప్రభుత్వపరంగా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల నియంత్రణకు ఓ కంట్రోల్ బాడీ ఉంటుందే తప్ప నిధులిచ్చే అవకాశం లేదు. ఉన్నత విద్యకు సంబంధించి ఇప్పటికే ఉన్న ఎన్‌సిటిఇ, ఎఐసిటిఇ రద్దయిపోతాయి. ఉన్నత విద్య ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. ఈ నేపథ్యంలో యుజిసిని కొనసాగించాలి. విద్యావేత్తలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి.
*-కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ ఎంఎల్‌సి*
*♦- మార్పులు మంచివైపు ఉండాలి*
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్నింట్లో మార్పులు రావడం సహజం. అయితే ప్రస్తుతం కేంద్రం తీసుకొస్తున్న మార్పులు మంచి కోసం చేస్తే మంచిదే. ఉన్నత విద్య బలోపేతానికి చర్యలు తీసుకోవాలి.
*-ముజఫర్ అలీ, ఉపకులపతి, ఉర్దూ విశ్వవిద్యాలయం, కర్నూలు*
[📚✍11న టీచర్ల మహాధర్నా✍📚
*♦- 4న మున్సిపల్ డైరెక్టరేట్ ముట్డడి*
*♦- సర్కారుకు ఫ్యాప్టో నోటీస్*
🌻ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికై ఆందోళన బాట పట్టనున్నట్లు ఫ్యాప్టో ప్రకటించింది. జులై 4న గుంటూరులో మున్సిపల్ డైరెక్టరేట్ ఎదుట ధర్నా, జులై 11న విజయవాడలో మహాధర్నా చేపట్టనున్నట్లు ఫ్యాప్టో వెలగపూడిలోని సచివాలయంలో ప్రభుత్వానికి ప్రత్యక్షచర్య నోటీసు అందజేసింది. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ పి బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ జి హృదయరాజు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఎన్నిసార్లు హామీలు ఇచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు, పండిట్, పిఇటి పోస్టుల అప్‌గ్రేడేషన్ సమస్యల పట్ల 2014 జులైలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా ఇప్పటికి అమలు కాలేదని తెలిపారు. నాలుగేళ్లుగా అనేక ప్రాతినిధ్యాలు, పోరాటాలు చేసినప్పటికి హామీలు ఇచ్చారే తప్ప పరిష్కారం చేయలేదని పేర్కొన్నారు.
🌻ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలు, మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు ఇప్పటికీ చేయలేదన్నారు. సెక్రటేరియేట్ నుండి నిబంధనలకు, కౌన్సెలింగ్ విధానానికి వ్యతిరేకంగా పైరవీ బదిలీలు చేస్తున్నారని విమర్శించారు. సర్వీస్‌రూల్స్ సమస్య పరిష్కారం కాకపోవడంతో గత ఆగస్టు నుండి పదోన్నతులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. పండిట్, పిఇటి పోస్టులన్నీ అప్‌గ్రేడ్ చేయాలని, రాబోయే డిఎస్‌సిలో అన్ని ఖాళీలు భర్తీ చేయాలని, విద్యాసంవత్సరం ప్రారంభం అయినప్పటికి విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, సైకిళ్లు ఇవ్వకపోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
🌻కో చైర్మన్లు జి నాగేశ్వరరావు, పి పాండురంగ వరప్రసాద్, పి కృష్ణయ్య, ఎపి జెఎసి సెక్రటరీ జనరల్ సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
✍15లోగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు*_
🌻 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల దరఖాస్తులకు కేంద్రం గడువు పొడిగించిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారు. జులై 15 వరకు పొడిగించారని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
🌻ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకొనేలా జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేయకపోయినా, అర్హులైన వారు దరఖాస్తు చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ కు తగినన్ని అవార్డులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని తెలిపారు.
🌻దీన్ని దృష్టిలో ఉంచుకొని అర్హులైన ఎక్కువ మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులను కోరారు.
🌻సాధించిన విజయాలు, వాటి ప్రభావం, ఇతర అంశాలు పూర్తి స్థాయిలో దరఖాస్తుకు జత చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. జులై 15 అర్ధరాత్రి వరకు గడువు ఉంటుందని, షషష.ఎష్ట్రతీస.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.
*📚✍టీచర్లపై సీబీఎస్‌ఈ వేటు✍📚*
🌻న్యూఢిల్లీ, జూన్ 28: సీబీఎస్‌ఈ టెన్త్, ట్వెల్త్ పరీక్షా పేపర్ల మూల్యాంకనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఉపాధ్యాయులపై వేటు పడింది. మార్కులు లెక్కించడంలో ఉపాధ్యాయులు పొరపాటును గుర్తించిన బోర్డు ఐదుగురు టీచర్లను సస్పెడ్ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చింది.
🌻 ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన విద్యార్థులు రీ వాల్యుయేషన్ కోసం బోర్డును ఆశ్రయించారు. ఢిల్లీకి చెందిన ఐదుగురు టీచర్లను సస్పెండ్ చేశామని, మరికొందరు రీజనల్ ఆఫీసర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఉపాధ్యాయు నిర్వాకం వల్ల ఉర్దూ పేపర్‌లో తప్పిన విద్యార్థి రీ వాల్యుయేషన్‌లో ఉత్తీర్ణుడైనట్టు చెప్పారు. ఈ కేసు ఒక ఉదాహరణ మాత్రమే.
🌻తప్పులకు సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధమవుతోంది. దీనికి బాధ్యులుగా గుర్తించి ఢిల్లీలో ముగ్గురు ప్రభుత్వ టీచర్లు, ఇద్దరు ప్రైవేటు టీచర్లను సస్పెండ్ చేసినట్టు సీబీఎస్‌ఈ అధికారులు వెల్లడించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించారు.
🌻టెన్త్, ట్వెల్త్ పరీక్షల మార్కుల లెక్కింపులో తప్పులు దొర్లినట్టు గమనించిన బోర్డు జూన్ 1న రీ వాల్యుయేషన్ ప్రారంభించింది.
🌻ఈరెండు తరగతులకు సంబంధించిన ఫలితాలు మే నెలాఖరున విడుదలయ్యాయి. తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థులు తిరిగి మూల్యాంకనకు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.
పైలెట్ ప్రాజెక్టుగా 6-8 తరగతుల విద్యార్థులకు
తొలిదశలో 1050 మంది
టీచర్లకు పునఃశ్చరణ, శిక్షణ
పాఠశాల విద్యాశాఖ కసరత్తు
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కంప్యూటర్ లేబొరేటరీ సదుపాయం ఉన్న 343 ఉన్నత పాఠశాలలకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) కరికులమ్ అందుబాటులోకి రానుంది. ఇందులో 168 మోడల్ స్కూళ్లు, 175 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. నిపుణుల సహకారంతో రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఈ రివైజ్డ్ కరికులమ్‌ను రూపొందించింది. ప్రయోగాత్మకంగా ఆయా పాఠశాలల్లో ఈ ఏడాది 6 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు. ఇందుకోసం తొలిదశలో 1050 మంది ఉపాధ్యాయులకు పునఃశ్చరణ, శిక్షణ ఇస్తున్నారు. ఈ నెలలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా పాఠశాల విద్యలో నాణ్యతను పెంపొందించడం, విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పాదుగొలపడం, డిజిటల్ లిటరసీ.. ఈ ప్రాజెక్టు ఉద్దేశం. చెన్నయ్‌కి చెందిన క్రిసాలిస్ సంస్థ ఇందుకు సహకారం అందించనుంది.
ఈ మేరకు త్వరలోనే విద్యాశాఖ అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. వచ్చే ఏడాది నుంచి 9వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతి విద్యార్థులకు ఈప్రాజెక్టును విస్తరించనున్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న 343 పాఠశాలల్లో కనీసం 40 లాప్‌టా ప్‌లు అందుబాటులో ఉన్నందునే ఎంపిక చేశారు. ఆయా స్కూళ్లలో ఇద్దరు సబ్జెక్టు టీచర్లు, ఒక కంప్యూటర్ ట్రైనర్‌ను ఏర్పాటు చేస్తారు. దశల వారీగా మరిన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు. పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి ఈ ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు.
బాబూ..చేరండి .... విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ కాలేజీల ఎదురుచూపులు
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): వృత్తి విద్యా కాలేజీల్లో అడ్మిషన్లు పడిపోతున్నాయి. ఇప్పటి వరకు బీఎడ్, లా, ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్సులకు పరిమితమైన ప్రవేశాల పతనం ఇప్పుడు పాలిటెక్నిక్ కోర్సులనూ తాకింది. ఇతర సాంకేతిక విద్యా కోర్సులతో పోలిస్తే.. పాలిటెక్నిక్ కోర్సులకు ప్రాధాన్యం ఉండేది. ఈ కోర్సులు చేసిన విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది.
ఈసారి ‘పాలిసెట్’లో 1,03,775 మంది అర్హత సాధించగా, వారి కోసం 291 పాలిటెక్నిక్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 74,312 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు విడతలుగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 50ు సీట్లే భర్తీ అయ్యాయి. అడ్మిషన్ తీసుకునేందుకు పాలిసెట్ ర్యాంకర్లు విముఖత వ్యక్తం చేస్తుండటంతో 37 వేల సీట్లు మిగిలిపోయాయి. మే 28న చేపట్టిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో 41,131మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవగా, వారిలో 39,470మంది మాత్రమే ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో 36,983మందికి సీట్లు కేటాయించారు. 38,349 సీట్లు మిగిలిపోయాయి. జూన్ 8-9 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించారు. కాలేజీల్లో సీట్ల సంఖ్యలో స్వల్పంగా మార్పు కనిపించినా, అడ్మిషన్లలో పెద్దగా మార్పులు లేవు.
రెండో దశ పూర్తయినా, భర్తీ అయిన మొత్తం సీట్లు 37,312 మాత్రమే. 36,952 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కటాఫ్ మార్కులను తగ్గించాలంటూ విజ్ఞప్తులు రావడంతో 5ు మార్కులు తగ్గించేలా ప్రతిపాదనలు సర్కారుకు చేరాయి. అధికారికంగా నిర్ణయం రాకున్నప్పటికీ తుదిదశ పాలిసెట్ నోటిఫికేషన్‌ను పొడిగించాలని అడ్మిషన్స్ కన్వీనర్ నిర్ణయించి గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 5-6తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన, ఆప్షన్ల నమోదు రెండూ సమాంతరంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులకు ఈ నెల 12 నుంచే తరగతులు నిర్వహిస్తున్నారు.
ఏపీఆర్‌సెట్‌కు 4 నుంచి దరఖాస్తులు
ఆగస్టు 22 నుంచి రాత పరీక్షలు
విశాఖపట్నం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో పరిశోధకుల ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై నాలుగో తేదీన ప్రారంభమై 25వ తేదీ వరకూ కొనసాగుతుందని ఏపీఆర్‌సెట్ చైర్మన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు తెలిపారు. రూ.2వేల అపరాధ రుసుంతో ఆగస్టు మూడు వరకూ, రూ.5వేలతో పదో తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. గురువారం ఇక్కడి సెనేట్‌హాలులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పరిశోధక ప్రవేశ పరీక్ష వివరాలను వెల్లడించారు.
రైల్వేలో మరిన్ని ఉద్యోగాలు.. 4,103 జాబ్స్‌కు నోటిఫికేషన్
హైదరాబాద్, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ఐటీఐ పూర్తిచేసిన వారికి తీపికబురు! దక్షిణ మధ్య రైల్వేలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ జరుగనుంది. వివిధ విభాగాల్లో మొత్తం 4,103 పోస్టుల భర్తీకిగాను దరఖాస్తులను ఆహ్వానిస్తూ దక్షిణ మధ్య రైల్వే బుధవారం నోటిఫికేషన్ వెలువరించింది. పదో తరగతితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎస్సీలకు 616, ఎస్టీలకు 308, ఓబీసీలకు 1,107, జనరల్ కేటగరీ వారికి 2,072 పోస్టులను కేటాయించారు.
ఏసీ మెకానిక్ విభాగంలో 249 పోస్టులు, కార్పెంటర్ విభాగంలో 16, డీజిల్ మెకానిక్ విభాగంలో 640, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగంలో 18, ఎలక్ట్రీషియన్ విభాగంలో 871, ఎలకా్ట్రనిక్ మెకానిక్ విభాగంలో 102, ఫిట్టర్ విభాగంలో 1,460, మెషినిస్ట్ విభాగంలో 74, ఎంఎండబ్ల్యూ విభాగంలో 24 , ఎంఎంటీఎం విభాగంలో 12, పెయింటర్ విభాగంలో 40, వెల్డర్ విభాగంలో 597 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 18 నాటికి 24 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను జూలై 17 వరకు సమర్పించవచ్చు.
సీపెట్‌లో డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్)లో డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆసక్తిగలవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా, మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ట్రైనింగ్ ఇన్‌చార్జి సీహెచ్.శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లోని జేఈఈ సీట్లన్నీ భర్తీ
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): జేఈఈ-2018 మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియను బుధవారం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లోని సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఐఐటీల్లో సీట్లు కేటాయించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, చేరేందుకు అంగీకారాల ప్రక్రియ గురువారం నుంచి జూలై 2 వరకు చేపట్టనున్నారు. 3న భర్తీ అయిన సీట్లు, ఖాళీల వివరాలను ప్రకటిస్తారు. అదేరోజు సాయంత్రం రెండో రౌండ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. మొత్తం ఏడు రౌండ్లలో సీట్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తారు. జేఈఈలో అర్హత సాధించిన అభ్యర్థులకు కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ(జోసా) అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టింది. దేశంలోని 23 ఐఐటీ, 23 ట్రిపుల్ ఐటీ, 31 ఎన్‌ఐటీ, 23 ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో అభ్యర్థులకు సీట్లు కేటాయించారు.
విద్యకు నిధుల్లో కోత : ఎస్‌ఎఫ్‌ఐ
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజిసి)ని రద్దు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్ చేసిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. యూజిసి రద్దు చేసి హయ్యర్ ఎడ్యూకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఈసిఐ) తీసుకురావడం ఉన్నత విద్యను ప్రైవేటీకరించడమేనని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కసాపురం రమేష్, వై రాము గురువారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగంపై కేంద్రప్రభుత్వం పెత్తనం చేయడానికేనని విమర్శించారు. హెచ్‌ఈసిఐకి పూర్తి హక్కులు ఉంటాయని, ఈ బిల్లు ప్రకారం విద్యాసంస్థలకు గ్రాంట్లు జారీచేసే అధికారం మానవ వనరుల శాఖకు దక్కుతుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రానికి ఇస్తామన్న నిధులివ్వకుండా సెంట్రల్ యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా కేంద్రప్రభుత్వం ద్వంద వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఈ బిల్లు వస్తే భవిష్యత్తులో విద్యారంగానికి మరింత నిధులు తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల స్థాపనకు అనుమతులు, నిబంధనలు పాటించని వర్సిటీలు, కళాశాలల గుర్తింపును రద్దుచేసే అధికారం హెచ్‌ఈసిఐకి ఉంటుందని, దీనివల్ల నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. హెచ్‌ఈసిఐ బిల్లును వెంటనే కేంద్రప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ గురుకులాల్లో సీట్లు పెంచాలని
- నక్కా ఆనంద్‌కు కెవిపిఎస్ వినతి
సాంఘిక, గిరిజన గురుకుల పాఠశాలల్లో సీట్లు పెంచాలని కోరుతూ కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మంత్రి నక్కా ఆనంద్ బాబుకు గురువారం వినతి పత్రం సమర్పించారు. గురుకుల పాఠశాలు, వాటిలో సీట్లూ తక్కువగా ఉండటం వల్ల, ఏటా వేలాది మంది విద్యార్థులు చదివే అవకాశాన్ని కోల్పోతున్నారని, ఈ పరిస్థితిని కొందరు దళారీలుగా క్యాష్ చేసుకుంటున్నారని మాల్యాద్రి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు దళారీలకు డబ్బిచ్చి మోసపోతున్నారని, సీట్లు రాక ఎస్సీ, ఎస్టీల పిల్లలు నిరాశ చెందుతున్నారని వివరించారు. సంక్షేమ వసతి గృహాలు మూసివేయాలనే తప్పుడు నిర్ణయం వల్లే విద్యార్థులకు ఈ దుర్గతి పట్టిందన్నారు. వాటిని మూయకూడదని ఎన్ని ఆందోళనలు చేపట్టినా, ఎన్ని వినతులిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ ఏడాదైనా విద్యార్థులకు సరిపడా సంఖ్యలో సీట్లు పెంచి అందరికీ న్యాయం చేయాలని కోరారు.