Type Here to Get Search Results !

విద్యా విషయక ముఖ్య వార్తా సమాహారం 14/7/2018

వనం-మనంలో 123 రోజులు 26 కోట్ల మొక్కలు

‘పర్యావరణానికి కాపాడుకుం దాం... హరితాంధ్రప్రదేశ్‌ లక్ష్యాన్ని చేరుకుందాం.. రండి ప్రతిఒక్కరూ మెక్కలు నాటుదాం’ అని అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ప్రాంగణంలో ఐదువేల మంది విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 23శాతం భూభాగం పచ్చదనం ఉండగా 2029 నాటికి దాన్ని 50శాతానికి పెంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వనం-మనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని మంత్రి చెప్పారు.
 రాష్ట్రంలో మొత్తం 123 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో 26 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు కృషి చేసిన పలు శాఖలకు ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ శనివారం(నేడు) అవార్డులను ప్రదానం చేయనుంది. నూజివీడులో నిర్వహించనున్న వనమహోత్సవంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ అవార్డును ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎక్కువ మొక్కలు నాటిన శాఖల్లో గ్రామీణాభివృద్ధిశాఖకు మొదటి బహుమతి లభించింది.

మెడికల్‌ సీట్ల భర్తీకి రీ కౌన్సెలింగ్‌!

బీసీలకు అన్యాయం వాస్తవమే
 అధికారుల అలసత్వమే కారణం
 బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్‌ తిప్పేస్వామి
అధికారుల అలసత్వం వల్ల ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీలో రిజర్వేషన్‌ వర్గాలకు ముఖ్యంగా బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మన్‌ గుండుమల తిప్పేస్వామి చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు మెడికల్‌ కౌన్సిలింగ్‌లో జరుగుతున్న అన్యాయంపై నెల రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోందన్నారు. బీసీ విద్యార్థులు, బీసీ సంఘాల వాదనలో న్యాయం ఉందని అన్నారు. శుక్రవారం జరిగిన కమిటీ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం వీసీ వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ వి. రామారావు పాల్గొన్నారు. 2001లో సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా రూపొందించిన 550 జీవో ప్రకారం 16 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మెడికల్‌ కౌన్సెలింగ్‌ సీట్లు భర్తీ చేశారని చెప్పారు. 2017 ఆగస్టు 30న కోర్టు మధ్యంతర స్టే ఇవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తిందన్నారు. స్టే ఎత్తివేయడానికి కావలసిన మద్దతు డాక్యుమెంట్లు, ఆధారాలు ఉన్నత విద్యాశాఖ వద్ద ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పించి స్టే ఎత్తివేయిస్తామని తిప్పేస్వామి చెప్పారు. రిజర్వేషన్‌ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కౌన్సెలింగ్‌ ఆపేయమని ఆదేశించారన్నారు. స్టే ఎత్తివేసిన తర్వాత రీకౌన్సెలింగ్‌ జరిపి రిజర్వేషన్‌ వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. జాప్యానికి కారకులైన వారిపై వచ్చే కమిటీ సమావేశంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.
 ఆధారాలు సమర్పించాం: అధికారులు
ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి సంబంధించి స్టే ఎత్తివేయాలని కోరుతూ తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించినట్టు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 550ను రూపొందించింది. ఈ జీవో ప్రకారం రిజర్వేషన్‌ అభ్యర్థి ఓపెన్‌ కేటగిరిలో ఒక కళాశాలలో చేరి, తర్వాత రిజర్వేషన్‌ కేటగిరిలో మరో కళాశాల లేదా కోర్సులోకి మారితే అప్పుడు ఏర్పడిన ఖాళీని అదే రిజర్వు కేటగిరీ అభ్యర్థితో మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలి. 2001 నుంచి ఈ ప్రకారమే ఎంబీబీఎస్‌ సీట్లు భర్తీ చేస్తున్నారు. 2017లో తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు కేటాయించారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు

అంగన్‌వాడీలు, ఆశావర్కర్లకు చంద్రబాబు వరాలు

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లకు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించారు. ఇటీవలే వారికి వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. వచ్చే నెలలో వారు కొత్త జీతాలు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం చంద్రబాబునాయుడు అంగన్‌వాడీలు, ఆశా వర్కర్ల భవిష్యత్తుకు మరింత భరోసా కల్పించారు. ఇప్పటివరకూ అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా వర్తింపజేస్తూ వచ్చారు. తాజాగా అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు చంద్రన్నబీమా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి విజయవాడలో నిర్వహించిన సభలో అధికారికంగా ప్రకటించారు.
 ఈ బీమా పథకం ద్వారా సహజంగా మరణిస్తే.. రూ. రెండు లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షలు, ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం ఏర్పడితే రూ. 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ. 2.50 లక్షలు చంద్రన్నబీమా ద్వారా ఆ కుటుంబానికి అందజేస్తారు. జిల్లాలో ఆశావర్కర్లు 3,082 మంది పనిచేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కలిపి సుమారు 12వేల మంది పనిచేస్తున్నారు. వీరందరికీ చంద్రన్నబీమా వర్తింపజేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే వేతనాలు పెంచిన సీఎం.. తాజాగా చంద్రన్నబీమా వర్తింపజేయడం తో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మంత్రి పరిటాల సునీతకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్ధులకు ‘హ్యాపీనెస్’ క్లాసులు!

విద్యార్థుల్లో సృజనాత్మకత, సత్‌‌ప్రవర్తన పెంపొందించడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. స్కూల్ సిలబస్‌లో ‘హ్యాపీనెస్ పాఠ్యాంశాన్ని’ ప్రవేశపెట్టింది. నర్సరీ నుంచి 8వ తరగతి వరకు విద్యార్ధులకు వచ్చే వారం నుంచి హ్యాపీనెస్ క్లాసులు ప్రారంభించనున్నట్టు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రకటించారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 9 నుంచి 10 లక్షల మంది విద్యార్ధులకు ఈ క్లాసులు బోధించనున్నట్టు అంచనా. నగరంలో ప్రాథమిక పాఠశాలలు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్‌తోనూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కార్పొరేషన్ స్కూళ్లు కూడా కలుపుకుంటే హ్యాపీనెస్ సిలబస్ కిందికి 15 నుంచి 16 లక్షల మంది విద్యార్ధులు చేరినట్టవుతుంది.
 ప్రతిరోజూ 45 నిమిషాల పాటు హ్యాపీనెస్ క్లాసు ఉంటుంది. తరగతి పట్ల పిల్లలు ఏకాగ్రత సాధించేలా ఐదు నిమిషాలు కేటాయిస్తారు. అనంతరం కథలు చెప్పడం, యాక్టివిటీస్ తదితర అంశాలు ఉంటాయి. సామాజిక వ్యవస్థ, ప్రకృతిలో పిల్లల పాత్రను అర్థం చేసుకునేలా... సృజనాత్మకతతో ఆలోచించేలా ఈ సిలబస్‌లో మొత్తం 20 కథలు, 40 వినూత్న కార్యకలాపాలు చేర్చినట్టు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ‘‘తీవ్రవాదం, అవినీతి, కాలుష్యం వంటి ఆధునిక సమస్యలకు తరగతి గదుల నుంచే పరిష్కారం రావాలి. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న ప్రయోగాన్ని ఒకనాటికి యావత్ దేశంతో పాటు ప్రపంచం కూడా అవలంబిస్తుంది..’’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రైవేటు విద్యా సంస్థల విపరీత బుద్ధి

- నకిలీ ఎన్‌ఓసిలతో ప్రభుత్వానికి బురిడీ
- ఫోర్జరీ సంతకాలతో రూ.5కోట్లుకు ఎగనామం
- 25 కళాశాలల గుర్తింపు
- కృష్ణాజిల్లాలో నాలుగు కేసులు నమోదు
మంచి విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులను తయారు చేయాల్సిన విద్యాసంస్థలే నీతిమాలిన పనికి పూనుకున్నాయి. ప్రతి ఏడాది విద్యాశాఖకు సమర్పించాల్సిన ఎన్‌ఓసి (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) కోసం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశాయి. దీనితో మోసానికి పాల్పడిన అన్ని కళాశాలలపై కేసులు నమోదు చేయమని అగ్నిమాపక శాఖ డిజి సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు కృష్ణాజిల్లాలో నాలుగు ప్రైవేటు కాలేజీలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నకిలీ ఎన్‌ఓసిలను విద్యాశాఖకు సమర్పించడంతో ప్రభుత్వానికి సుమారు రూ.5 కోట్లు వరకు నష్టం వాటిల్లునట్లు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 కళాశాలలు ఈ మోసానికి పాల్పడినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. ప్రతి ఏడాది విద్యాసంస్థలకు సాధారణ అనుమతుల్లో భాగంగా అగ్నిమాపక శాఖ అధికారులు ఇచ్చే ఎన్‌ఓసిలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ శాఖ అధికారులు ఒక ఏడాది పరిమితతో మాత్రమే సర్టిఫికెట్లను మంజూ రు చేస్తుంటారు. ఈ ఏడాది కొన్ని కళాశాలలు సమర్పించిన ఎన్‌ఓసిల్లో ఐదేళ్లు కాల పరిమితి ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనితో ప్రైవేటు కళాశా లలు ఫోర్జరీ సంతకాలు, నకిలీ సర్టిఫికెట్లుతో చేస్తు న్న దందా బయట పడింది. కృష్ణాజిల్లాలో 9, ప్రకా శం జిల్లాలో 13, కర్నూలులో 2, విశాఖలో 1 కళా శాల నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు నిర్థారణ అయ్యింది. కృష్ణాజిల్లాలో డిఎఫ్‌ఓ ఫోర్జరీ సంతకంతో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన జూని యర్‌, ట్రైనింగ్‌ కాలేజీలపై ఐపిసి సెక్షన్లు 465, 468, 471 కింద కేసులు నమోదయ్యాయి. మిగి లిన జిల్లాల్లోనూ మోసానికి పాల్పడ్డ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారు లు సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

మోసానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు - ఫైర్‌ డిజి సత్యనారాయణ
ఫోర్జరీ సంతకాలతో మోసానికి పాల్పడ్డ ప్రైవేటు కళాశాలల యాజమన్యాలపై కఠిన చర్యలు తీసుకుం టామని అగ్నిమాపక శాఖ డిజి సత్యనారా యణ స్పష్టం చేశారు. ఎన్‌ఓసి రెన్యూవల్స్‌ సమ యంలో దర్యాప్తు చేస్తే కాలేజీలు చేస్తున్న మోసం బయటపడిం దన్నారు. ఎన్‌ఓసిలకు సంబంధించి ఒక వ్యాజ్యం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని ప్రస్తుతం నకిలీ సర్టిపికెట్ల వ్యవహారాన్ని కూడా అఫిడవిట్‌ రూపంలో కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. నకిలీ దందాలో ఎవరెవరు న్నారనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని తెలిపారు. ఫోర్జరీ ఎక్కడ జరిగినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని సంబంధిత డిఎఫ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మోసానికి పాల్పడ్డ కాలేజీల అనుమతులు రద్దుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

1900 ఏఎన్‌ఎమ్‌ పోస్టుల భర్తీ

- రెగ్యులర్‌ ప్రాతిపదికపై నియామకాలకు జిఒ జారీ
 రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న 1900 ఏఎన్‌ఎమ్‌ పోస్టులను రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అనుమతులిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యఆరోగ్య శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7606 ఆరోగ్య ఉప కేంద్రాలలో మంజూరు చేసిన పోస్టుల్లో 1900 ఖాళీలను భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఆ సబ్‌సెంటర్లతోపాటు యూరోపియన్‌ కమిషన్‌ సెక్టర్‌ పథకం కింద మరో 1021 సబ్‌సెంట ర్లలో కాంట్రాక్టు విధానంలో ఏఎన్‌ఎం, అదనపు ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు. ఇప్పుడున్న 1900 ఖళీలను రెగ్యులర్‌ ప్రాతిపదికపై భర్తీ చేయడంతోపాటు భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా భర్తీ చేయడానికి అనుమతించాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ ప్రభుత్వాన్ని కోరారు. కాని 1900 ఖాళీల భర్తీకి మాత్రమే జిఒలో అనుమతినిచ్చారు. ఇదిలావుండగా సుదీర్ఘ కాలంగా ఏఎన్‌ఎమ్‌లుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారిని సీనియార్టీ ప్రాతిపతికగా రెగ్యులరైజ్‌ చేయాలని యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఎ.వి. నాగేశ్వరరావు ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

మోడల్‌ సూళ్లను రాష్ట్ర ప్రభుత్వమే నడపాలి

- టీచర్ల ధర్నాలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు డిమాండ్‌
ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులపై రాష్ట్రంప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు విమర్శించారు. ఈ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఎమ్మెల్సీల కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూల్స్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలోని అలంకార్‌ సెంటర్‌లో ధర్నా శుక్రవారం జరిగింది. ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ మురళీమోహన్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగేశ్వరరావు మాట్లాడారు. ఐదేళ్ల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఇప్పటికీ సర్వీస్‌ రూల్స్‌ విడుదల చేయలేదని తెలిపారు. ఎమ్మెల్సీల కమిటీ ఆరునెలల కిందటే సిఫార్సులు చేసినా వాటిని అమలును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పిఆర్‌సి బకాయిలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినా నేటికీ విడుదల చేయలేదన్నారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెలను అమలు చేయాలని, హెల్త్‌కార్డు, పెన్షన్‌ విధానం అమలు, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, రెండో దశలో చేరిన ఉపాధ్యాయుల పిఆర్‌సి ఫిట్‌మెంట్‌లో తేడాను సరిచేయాలని, పాఠ్య పుస్తకాలు, సమ రూప దుస్తులు పంపిణీ చేయాలని కోరారు. భవిష్యత్తులో చేసే ఆందోళనలకు యుటిఎఫ్‌ అండగా ఉంటుందని హామీనిచ్చారు. ఫెడరేషన్‌ అధ్యక్షులు ఎస్‌.మురళీమోహన్‌ మాట్లాడుతూ హిందీ పిజిటి పోస్టులు కేటాయించి, ప్రమోషన్ల లిస్టు వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు
Tags