24న రాష్ట్ర బంద్ - ప్రత్యేక హోదా కోసం వై కా పా
కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 24న (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హోదా విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బంద్‌కు పిలుపునివ్వాలని తమ పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్ శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్‌టీయూ సెంటర్ వద్ద తన శిబిరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ బంద్‌కు సహకరించాలని ప్రతి పార్టీకి, ప్రతి సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ రోజున సహకరించాలని కోరారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంపై శుక్రవారం పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేస్తున్న మోసాలను ఆయన ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలో చట్టంలో కచ్చితమైన పదాలను చేర్చకుండా దారుణంగా మోసం చేస్తే, ఇప్పుడు బీజేపీ మోసం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును, హోదా విషయంలో ఆయన వైఖరిని జగన్ తీవ్రంగా దుయ్యబట్టారు. అవిశ్వాసం సందర్భంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగకుండా వారి వారి ఎజెండాల ప్రస్తావనకు వాడుకున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎవరు గట్టిగా చెబితే వారికే కేంద్రంలో తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టీకరించారు. పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.