Type Here to Get Search Results !

DyEOల పై పనిభారం అదనపు పోస్టులు మంజూరు చేయండి

DyEOల పై పనిభారం అదనపు పోస్టులు మంజూరు చేయండి

ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు
111 కొత్త పోస్టుల కోసం లేఖ

పాఠశాల విద్యాశాఖపై ప్రభుత్వం అదనపు పనిభారం మోపుతోంది. ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను, అధికారులను ప్రభుత్వం ఉపయోగిస్తోంది. వనం-మనం వంటి కార్యక్రమం నుంచి దోమలపై దండయాత్ర కార్యక్రమం వరకు ఆ శాఖను ఉపయోగిస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల విద్యార్థులకు తరగతులు జరగకపోవడం విశేషం కాగా, మరోవైపు పాఠశాల విద్యాశాఖ అధికారులపై తీవ్రమైన పనిభారం పడుతోంది. జిల్లాల్లో మొత్తం శాఖను పర్యవేక్షించాల్సిన అధికారులు వీటివల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా డిప్యూటీ డిఇవో(జిల్లా ఉప విద్యాశాఖ అధికారి)లపై ఈ భారం ఎక్కువగా ఉంటుంది. 
జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారికి పాఠశాల ప్రధానోపాధ్యాయుల మధ్య అనుసంధానంగా ఉండాల్సిన అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటున్నారు. చేయాల్సిన పని కాకుండా హడావుడి కార్యక్రమాలకు హాజరుకావడంతో అసలు పని పక్కకు పోతోంది. పాఠశాలలను తనిఖీ చేయాల్సిన అధికారులు పని ఒత్తిడిలో చేయలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్‌ పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడుతోంది. డిప్యూటీ డిఇవో ఏడాదికి 400 పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉండగా, అధికారుల కొరతతో 1200 నుంచి 1500ల వరకు తనిఖీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తనిఖీలు నిర్వహించలేకపోవడంతో ప్రైవేట్‌ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వీటితో పాటు ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ హాజరు, సిసిఈ విధానం తీరు, మధ్యాహ్నా భోజనం, పరీక్షల మార్కులు, విద్యార్థుల హాజరు వంటి పనులను కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి.

పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడటంతో పాటు విద్యాప్రమాణాలు కూడా రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఈ పని ఒత్తిడిని గుర్తించిన పాఠశాల విద్యాశాఖ కొత్తగా 111 డిప్యూటీ డిఇవోల పోస్టులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 64 మంది డిప్యూటీ డిఇవోలు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 175 పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గానికి ఒక పోస్టు కేటా యించాలని విద్యాశాఖ ఆలోచన. ఇందులో భాగంగానే 111 డిప్యూటీ డిఇవో పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలను పంపింది. ప్రస్తుతం ఈ ఫైల్‌ ఆర్థిక శాఖకు చేరుకుంది. రాష్ట్రంలో 200 శాఖలు ఉంటే, అందులో పాఠశాల విద్యాశాఖ చాలా ప్రాధాన్యం గల శాఖ అని, పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపడాలంటే ఈ పోస్టులు అవసరమని విద్యాశాఖ పేర్కొంది. విశాఖాకు ఆర్‌జెడిని కూడా నియమించాలని ప్రతిపాదనలు పంపింది.
Tags