ఇక రైలు ప్రయాణాలకు గుర్తింపు కార్డు అక్కర్లేదు
దిల్లీ: రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్తే ఎక్కడైనా పోతాయేమోనని ఆందోళన పడుతున్నారా? అయితే ఇక మీదట ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే రైలు ప్రయాణాల్లో ఐడీ కార్డులను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లకు బదులు వాటి సాఫ్ట్ కాపీలు చూపిస్తే సరిపోతుందని ఈరోజు రైల్వే అధికారులు వెల్లడించారు. డిజిలాకర్‌లో సేవ్ చేసి పెట్టుకున్న మీ ధ్రువీకరణ పత్రాలను అధికారులకు చూపించవచ్చు. డిజిలాకర్ యాప్ సర్వీసును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులోని డిజిటల్ స్టోరేజీలో భారత పౌరులు తమ అధికారిక పత్రాలను క్లౌడ్‌లో భద్రపరుచుకోవచ్చు.
ఇకపై రైలు ప్రయాణాల్లో కూడా డిజిలాకర్‌లో భద్రపరుచుకున్న ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్‌ల సాఫ్ట్ కాపీలను గుర్తింపు కార్డులుగా పరిగణించాలని ఆదేశిస్తూ అన్ని రైల్వే జోనల్స్‌లోని ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు సందేశం పంపించారు. డిజిలాకర్‌లోని ‘ఇష్యూయిడ్ డాక్యుమెంట్స్’ విభాగంలోని ధ్రువీకరణ పత్రాలను మాత్రమే ప్రూఫ్‌గా పరిగణించాలని, అప్‌లోడెడ్ విభాగంలోనివి కాదని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ డిజిలాకర్‌ను ప్రవేశపెట్టారు. క్లౌడ్ ఆధారిత ఈ యాప్ సీబీఎస్‌ఈతో కూడా అనుసంధానమైంది. విద్యార్థులకు మార్కుల పత్రాలను డిజిటల్ వర్షెన్‌లో అందించేందుకు దీన్ని ఉపయోగించుకుంటారు. డిజిలాకర్‌లో సబ్‌స్క్రైబర్లు తమ పాన్ నెంబరు కూడా చేర్చుకోవచ్చు.