Type Here to Get Search Results !

తరగతి పెరిగే కొద్దీ ‘లెక్క’తప్పుతోంది

తరగతి పెరిగే కొద్దీ ‘లెక్క’తప్పుతోంది


న్యూదిల్లీ: కింది తరగతులను నుంచి పై తరగతులకు వెళ్లే కొద్దీ భారతీయ విద్యార్థుల్లో పాఠ్యాంశాల పై పట్టు తగ్గుతోందని ముఖ్యంగా గణితం, సైన్స్‌ విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని జాతీయ అఛీవ్‌మెంట్స్‌ సర్వే(ఎన్‌ఏఎస్‌) నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మూడు, ఐదు, ఎనిమిది తరగతులు చదువుతోన్న విద్యార్థులను పరీక్షించిన అనంతరం ఎన్‌ఏఎస్‌ ఈ వివరాలను బయటపెట్టింది. మానవ వనరులు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలల్లో ఈ సర్వే నిర్వహించింది.
కింది తరగతి నుంచి పై తరగతి వెళ్లే కొద్ది పాఠ్యాంశాలకు సంబంధించి వివిధ ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయడంలో విద్యార్థులు వెనకబడిపోతున్నారని అందులో వెల్లడించింది. నివేదిక ప్రకారం.. ఈ విషయంలో దిల్లీ అధ్వాన స్థితిలో ఉంది. మూడో తరగతి చదువుతోన్న విద్యార్థులు గణితంలో 54 శాతం ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వగా, ఐదో తరగతిలో అది 44 శాతం, ఎనిమిదో తరగతిలో 32శాతంగా నమోదైంది. అయితే బిహార్‌ విద్యార్థులు మాత్రం గణిత ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి ఆశ్చర్యపర్చారు. అక్కడ మూడో తరగతి చదివేవారు గణిత ప్రశ్నలకు 63 శాతం సరైన సమాధానాలు ఇచ్చారు. ఐదో తరగతికి ఆ శాతం 52, ఎనిమిదో తరగతికి 45 శాతంగా ఉంది. కింది నుంచి పై తరగతికి వెళ్లే కొద్దీ ఈ వ్యత్యాసం దారుణంగా పడిపోయి పశ్చిమ బంగ ప్రథమ స్థానంలో ఉంది. అయితే మూడు నుంచి ఎనిమిదో తరగతికి ఆ తేడా రాజస్థాన్, జార్ఖండ్‌లో తక్కువగా నమోదైంది. సైన్స్‌ ప్రశ్నలకు జార్ఖండ్, కర్ణాటక విద్యార్థులు సరైన సమాధానాలు ఇవ్వడంలో ముందు వరసలో ఉన్నారు. ఉద్యోగం విషయంలో కర్ణాటకకు చెందిన 79 శాతం మంది ఉపాధ్యాయులు సంతృప్తిని వ్యక్తం చేశారు. బిహార్(50 శాతం), దిల్లీ(44 శాతం) టీచర్లు ఉద్యోగాన్ని సంతోషంగా చేస్తున్నట్లు వెల్లడించారు.
విద్యార్థులు, ఉద్యోగులపై చేపట్టిన ఈ సర్వే ప్రపంచ స్థాయిలో చాలా పెద్దది. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 1,10,100 పాఠశాలల్లో చదువుతోన్న 2.2 మిలియన్ల విద్యార్థుల పై ఈ సర్వే చేపట్టారు. మూడు, ఐదో తరగతి చదువుతోన్న విద్యార్థులకు 45 ప్రశ్నలు, ఎనిమిదో తరగతి చదువుతోన్న విద్యార్థులకు 60 ప్రశ్నలు ఇచ్చి గణితం, భాషా శాస్త్రం, పర్యావరణ సైన్స్‌, సైన్స్‌, సోషల్ సైన్స్‌ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
Tags