Type Here to Get Search Results !

పాత పెన్షన్ విధానమే కావాలి -'క్విట్‌ సిపిఎస్‌' జాతాల్లో ఫ్యాప్టో నేతల డిమాండ్‌

పాత పెన్షన్ విధానమే కావాలి -'క్విట్‌ సిపిఎస్‌' జాతాల్లో ఫ్యాప్టో నేతల డిమాండ్‌


  • - 'క్విట్‌ సిపిఎస్‌' జాతాల్లో ఫ్యాప్టో నేతల డిమాండ్‌
  • - ఇచ్ఛాపురం, లేపాక్షిల్లో ప్రారంభమైన యాత్రలు
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సిపిఎస్‌) రద్దు కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా లేపాక్షి నుండి, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంల నుండి బస్సు, జీపు యాత్రలు సోమవారం ప్రారంభ మయ్యాయి. లేపాక్షిలో యాత్రను రాష్ట్ర ఛైర్మన్‌ బాబురెడ్డి, ఇచ్చాపురంలో ప్రధాన కార్యదర్శి జి హృదయరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబురెడ్డి మాట్లాడుతూ సెప్టెంబరు 1న రాష్ట్రం లోని అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించ నున్నట్లు తెలిపారు. సిపిఎస్‌ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1.86 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పెన్షన్‌ భద్రత కోల్పోతారని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 653, 654, 655 జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తూ తీర్మానం చేయాలని కోరారు. పిఎఫ్‌ఆర్‌డిఎతో ఒప్పందం రద్దు చేసుకోవాలని చెప్పారు. సిపిఎస్‌ అమలుకు పిఎఫ్‌ఆర్‌డిఎ చట్టం చేసిన పాలక పార్టీలన్నీ తమకు బాధ్యత లేనట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సిపిఎస్‌ రద్దు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో పాలకులకు చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాబురెడ్డితో పాటు జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌బాబు, కో ఛైర్మన్‌ రఘురామిరెడ్డి, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ జిలానీ, జిల్లా ఛైర్మన్‌ ముత్యాలప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఇచ్చాపురంలో ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హృదయరాజు, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తోన్న సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక భరోసా లేకపోవడంతో అనేక కుటుంబాలు జీవన భద్రత కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు (మంగష్ట్రవారం) జిల్లాల్లో ప్రారంభమైన జాతాలు 12 రోజుల పాటు 13 జిల్లాల్లో పర్యటిస్తాయని, ఈ సందర్భంగా ర్యాలీలు, బహిరంగ సభలు జరగనున్నాయని తెలిపారు. తొలి రోజు జాతా ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, శ్రీకాకుళం మండలాల్లో సాగింది.