- అమలుకు నోచుకోని న్యాయస్థానాల ఆదేశాలు
- సహేతుక కారణాలు లేకున్నా కాలయాపన
- అరకొర బోధనతో విద్యార్థులకు ఇక్కట్లు
విషయం ఇదీ!
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 78 యాజమాన్యాల ఆధ్వర్యంలోని 270 పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీవో 40 ప్రకారం తొలుత తాత్కాలికంగా భర్తీ చేసుకోవాలని 2016 డిసెంబరు 6న ఆదేశాల్చింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తూ 2017 జూన్ 30న శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసుకునేందుకు పచ్చజెండా ఊపింది. 2002 సెప్టెంబరు 23 నాటికి అన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో అప్రూవ్ అయిన అన్‌ఎయిడెడ్ పోస్టుల్లో పనిచేస్తున్నవారికి పదోన్నతులు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. సర్కారు ఆదేశాల మేరకు మేనేజ్‌మెంట్లకు సంబంధించిన స్కూళ్ల లో జిల్లాల్లో ఏర్పాటైన త్రిసభ్య కమిటీలు దరఖాస్తులు స్వీకరించి నియామకాలను ప్రారంభించాయి. అయితే, ఈ ప్రక్రియలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు మీడియాలో కథనాలు రావడంతో ప్రభుత్వం నియామకాలను నిలిపేసింది.ముగ్గురు ఆర్జేడీల నేతృత్వంలో వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసి నియామకాలపై విచారణ జరపాలని ఆదేశించింది. ఈ కమిటీలు విచారణ చేసి నివేదికను అందజేశాయి. అయితే, ఈ విషయంలో నిర్ణయం తీసుకోకుండా సర్కారు కాలయాపన చేస్తోంది. ఇదిలావుంటే, తమ పాఠశాలల్లో కూడా టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ మరో 93 మేనేజ్‌మెంట్లు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆయా స్కూళ్లలో నియామకాల విషయంపై వివరణ ఇవ్వాలని కోర్టు పాఠశాల విద్యాశాఖను కోరింది. కానీ ఇంత వరకు సర్కారు నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. ఫలితంగా ఎయిడెడ్ టీచర్ల నియామకాల విషయంలో సర్కారు ఏం చేయాలని భావిస్తోందో అంతుబట్టడం లేదు. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది
