అక్షరభారతి పేరుతో అక్రమ వసూళ్లు !
- ఇంటర్వ్యూలు పెట్టి వసూళ్లకు నిరుద్యోగుల ఎంపిక
- రూ.10 లక్షల వరకు దండుకున్న వైనం
- పలాస వేదికగా ఘరానా మోసం
శ్రీకాకుళం : ప్రభుత్వ పాఠశాలల్లో యోగా, ధ్యానం, వ్యక్తిగత నైపుణ్యం పెంపుదల తరగతుల నిర్వహణకు ఒక్కో పాఠశాలకు ఒక్కో శిక్షకుడిని నియమిస్తాం.. నెలకు రూ.12 వేల జీతం..డిగ్రీ విద్యార్హత ఉంటే చాలు.. పర్మినెంటు ఉద్యోగమంటూ ఇటీవల వాట్సాప్‌లో వచ్చిన ఓ ప్రకటన చూసిన శ్రీకాకుళం జిల్లాలోని అనేకమంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నా రు. పలాసతోపాటు చుట్టుపక్కల ఆరు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అక్షరభారతి పేరుతో గత నెలలో ఇంటర్వ్యూలు జరిగాయి. వీరిలో మెరిట్ ఆధారంగా ఓ 80 మందిని ఎంపిక చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ పలాసలోని బెండిగేటు వద్ద మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. వారిలో 40 మందిని తొలి విడత ఎంపిక చేస్తున్నట్టు చెప్పిన నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల చొప్పున వసూలుచేశారు. ఆరు మండలాలకు కేవలం ఆరుగురు కో-ఆర్డినేటర్లు అవసరం కాగా, దాదాపు 40 మందిని విజయనగరం కలెక్టరేట్ దగ్గర ఓ వసతిగృహంలో శిక్షణకు పిలిచారు. కోఆర్డినేటర్ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఒక్కొక్క రు రూ.30 వేలు, మరికొందరు రూ.20 వేల చొప్పున చెల్లించి శిక్షణకు హాజరయ్యారు. శిక్షణలో పాఠశాల సంబంధిత అంశాలపై మెళకువలు నేర్పాల్సి ఉండగా బ్యాంకు అకౌంట్లు తెరిచే విధి విధానాలపై తర్ఫీదు ఇస్తుండటంతో అసలు విషయం బయటపడింది.
ఇస్రో అనే ఎన్జీవో సంస్థ ఈ ఇంటర్వ్యూలను బ్రెడ్స్ సంస్థ సహకారంతో పలాస వేదికగా నిర్వ హించింది. దీనికి హాజరైన వారిలో చాలామంది నుంచి రూ.10 లక్షల వరకు వసూళ్లు చేసేశారు. హరి అనే ఓ వ్యక్తి తన అకౌంట్ నంబరును నేరు గా నిరుద్యోగులకు ఇచ్చి డబ్బు వేయించుకున్నా డు. ఇంటర్వ్యూలకు వచ్చిన వారందరికీ ఫోన్లు చేసి బ్యాంకు ఖాతాలో డబ్బు వేస్తే కాల్ లెటర్ ఇస్తామని చెబుతుండటంతో కొందరికి అనుమా నం వచ్చింది. గట్టిగా నిలదీయడంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా తప్పించుకోవడం మొదలు పెట్టారు. బాధితుల ఆందోళనను సంబంధిత వ్యక్తి వద్ద ప్రస్తావించగా తొలుత తడబడ్డారు. తనకేమీ తెలియదంటూ తనపై ఉద్యోగి శ్రీనివాస్ పేరు చెప్పాడు. అతని వద్ద ప్రస్తావించడంతో తాము ఇంటర్వ్యూలు నిర్వహించిన మాట వాస్తవమేనని, అయితే ఆరుగురు మండల కోఆర్డినేటర్లకు మాత్రమే ఉద్యోగాలు ఉన్నట్టు స్పష్టంచేశారు. 40 మందికి విజయనగరంలో శిక్షణ ఇస్తున్న విషయం తనకు తెలియదని, దర్యాప్తు చేసి బాధ్యులపై చర్య లు తీసుకుంటామని సమాధానమిచ్చారు. ఇదే అంశంపై బ్రెడ్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రామ కృష్ణంరాజు స్పందిస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించు కుంటామని తోటి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తమను కోరడంతో తమ కార్యాలయాన్ని ఒక్కరోజు కేటాయించాము తప్ప ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. స్వచ్ఛందసంస్థలు ఏ అంశంలోనైనా నిధులు ఖర్చు చేస్తాయి తప్ప ఇలా డబ్బు వసూలు చేయవని స్పష్టం చేశారు.