Type Here to Get Search Results !

ఎస్సీఎస్టీ పదోన్నతుల్లో కోటాపై ధర్మాసనం

  • ఎస్సీఎస్టీ పదోన్నతుల్లో కోటాపై ధర్మాసనం
  • ఐదుగురు జడ్జీలతో ఏర్పాటు

న్యూఢిల్లీ, ఆగస్టు 1: పన్నెండేళ్ల క్రితం పదోన్నతులపై వెలువరించిన తీర్పు పునస్సమీక్షకు ఐదుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సారథ్యంలోని ఈ బెంచ్‌లో జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ ఆర్‌ ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలు ఉంటారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో క్రీమీ లేయర్‌ (సంపన్న శ్రేణి) నియమం వర్తించాలా అక్కర్లేదా.. అన్న విషయమై 2006లో సుప్రీంకోర్టు ఓ కీలకమైన తీర్పును ఇచ్చింది. దాన్ని సవాల్‌ చేస్తూ 40 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించి ఆనాటి తీర్పును సమీక్షించడానికి ఏడుగురు జడ్జీలతో విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలా.. అనే విషయాన్ని ఐదుగురు జడ్జీల బెంచ్‌ నిర్ధారిస్తుంది. ఎం నాగరాజ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసుగా 2006 నాటి తీర్పుకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఓబీసీల మాదిరిగా పదోన్నతుల్లో క్రీమీలేయర్‌ వర్తించడం కుదరదన్నది ఆనాటి తీర్పు సారాంశం. అంతకుముందు 1992లో వెలువడ్డ మండల్‌ కమిషన్‌ తీర్పులోనూ, 2005లో చెన్నయ్య వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కేసు తీర్పులోనూ క్రీమీలేయర్‌ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం స్పృశించింది.
2006 నాటి కేసుపై గత 12 సంవత్సరాలుగా అనేకమార్లు అనేకమంది అప్పీలు పిటిషన్లు వేశారు. ఈ కేసులో ప్రతిష్ఠంభన వల్ల వేలాది ఉద్యోగాల భర్తీ నిలిచిపోయిందని, దీన్ని త్వరగా ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ఏప్రిల్‌లోనే కోరినా ఆగస్టు వరకూ నిర్ణయం ఉండదని సీజే స్పష్టంగా చెప్పారు. అయితే జూన్‌ 5న సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ కేంద్రానికి ఓ ఊరటనిచ్చింది. చట్టప్రకారం ఎస్సీ ఎస్టీలకు పదోన్నతిల్లో కోటా కల్పించుకోవచ్చని, అయితే ఆ నిర్ణయం రాజ్యాంగ ధర్మాసనం తీసుకొనే తుది తీర్పుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. పదోన్నతికి సంబంఽధించిన కేసులు ఉన్నత న్యాయస్థానాల్లో ఇరుక్కుపోవడం వల్ల వేలమందికి ప్రమోషన్లు నిలిచిపోయాయని కేంద్రం చెప్పడంతో ద్విసభ్య బెంచ్‌ ఈ ఊరటనిచ్చింది.