Type Here to Get Search Results !

Telugu Educational News 6th Oct 2022

5G: ‘4జీ నుంచి 5జీకి మారండి’ అని మెసేజ్‌ వచ్చిందా కొంపదీసి..!

5జీ సర్వీస్‌ల పేరుతో సైబర్‌ మోసాలు
తస్మాత్‌ జాగ్రత్త అంటున్న పోలీసులు


హైదరాబాద్‌: 5జీ సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇదే అదునుగా భావించే సైబర్‌ నేరగాళ్లు కొత్త స్కామ్‌లకు తెరలేపి అందినంతా దోచేస్తారని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 5జీ సేవల వినియోగం కోసం కస్టమర్లు ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలో ‘4జీ నుంచి 5జీ మారండి. మీకు కావాల్సిన సేవలు మేం అందిస్తాం’ అంటూ.. కొంతమంది సైబర్‌ కేటుగాళ్లు మెసేజ్‌లు, లింక్‌లు పంపిస్తున్నారు. అదంతా నిజమని నమ్మిన కస్టమర్లు ఆ లింక్‌లను క్లిక్‌ చేస్తే ఫోన్‌లోని డేటా అంతా సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుందన్నారు. దాంతో బ్యాంకు ఖాతాలకు లింక్‌ అయి ఉన్న ఫోన్‌నంబర్‌ తెలుసుకుంటారన్నారు. ఆ నంబర్‌ను బ్లాక్‌ చేయించి, సిమ్‌ స్వాప్‌ దందాకు పాల్పడి, అదే నంబర్‌తో మరోసిమ్‌ తీసుకుని బ్యాంకు ఖాతాలకు లింక్‌ చేసి డబ్బంతా కొల్లగొడతారని హెచ్చరిస్తున్నారు. లేదా 5జీ సర్వీస్‌లు అందిస్తున్నామంటూ వివిధ రకాల చార్జీల పేరుతో అందినంతా దండుకొని ఉడాయిస్తారని తెలిపారు. ఇటువంటి పలు రకాల సైబర్‌ మోసాలపై కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి.. భారత కంపెనీ కలుషిత సిరప్‌ వల్లే!

జెనీవా: భారత్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న సిరప్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణాలకు.. ఆ కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో. 

ఈ మేరకు..డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రెస్‌ మీడియా ప్రకటన చేశారు. భారత దేశానికి చెందిన మెయిడెన్‌ ఫార్మాసూటికల్స్‌ తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్‌లను వాడడం వల్లే చిన్నారుల కిడ్నీలు దెబ్బ తిని మరణించి ఉంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్నారుల మృతి ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిందన్న ఆయన.. ఈ కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశం వెలుపల పంపిణీ చేయబడి ఉండవచ్చని, కాబట్టి వాటిని వాడొద్దని హెచ్చరించారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి భారత్‌కు చెందిన మెయిడెన్‌ కంపెనీతో పాటు ఆ దేశ ఔషధ నియంత్రణ మండలిపైనా విచారణ ఉంటుందని ట్రెడోస్‌ వెల్లడించారు.

"WHO has today issued a medical product alert for four contaminated medicines identified in #Gambia that have been potentially linked with acute kidney injuries and 66 deaths among children. The loss of these young lives is beyond heartbreaking for their families"-@DrTedros
— World Health Organization (WHO) (@WHO) October 5, 2022

మెయిడెన్‌ కంపెనీ తయారు చేస్తున్న Promethazine ఓరల్ సొల్యూషన్, Kofexmalin బేబీ కాఫ్‌ సిరప్, Makoff బేబీ కాఫ్‌ సిరప్‌, Magrip N కోల్డ్ సిరప్ ఈ జాబితాలో ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ రోజు వరకు కూడా తయారీదారు కంపెనీ ఈ ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై WHOకు ఎలాంటి హామీలను అందించలేదని తెలిపింది. పిల్లల్లో వాంతులు, డయేరియా, మూత్రవిసర్జనకు ఆటంకం, తలనొప్పి, చివరికి.. కిడ్నీని దెబ్బ తీసి ప్రాణం తీయొచ్చని హెచ్చరించింది.

ల్యాబ్‌ పరీక్షల్లో.. ఆమోద యోగ్యం కానీ రీతిలో డైథెలిన్‌ గ్లైకాల్‌, ఇథిలీన్ గ్లైకాల్‌తో సిరప్‌లను కలుషితం చేసినట్లు తేలింది. ఇదీ ప్రాణాంతకమని కూడా డబ్ల్యూహెచ్‌వో ప్రకటన స్పష్టం చేసింది. గాంబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత నెలలో ఆసుపత్రులను పారాసెటమాల్ సిరప్‌లను వాడటం మానేయాలని కోరింది.

అయితే.. భారతదేశ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన అందిన సమాచారం ప్రకారం.. తయారీదారు కలుషితమైన మందులను గాంబియాకు మాత్రమే సరఫరా చేసినట్లు WHO తెలిపింది. అయినప్పటికీ.. అనధికార మార్గాల్లో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు అవి సరఫరా అయ్యి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అంతేకాదు.. మెయిడెన్‌ కంపెనీ స్థానికంగా(భారత్‌లో కూడా!) అవే కలుషితాలను కలిపి ఉత్పత్తులు విడుదల చేసి ఉంటుందనే అనుమానాల నడుమ ఉత్పత్తుల జాబితా నుంచి వాటిని తొలగించడమే మంచిదని డబ్ల్యూహెచ్‌వో, భారత ఔషధ నియం‍త్రణ మండలికి సూచించింది.

ఇహెచ్‌ఎస్‌ కార్డులు ఇచ్చేదెన్నడు ?

సచివాలయ ఉద్యోగులకు భారంగా మారిన ప్రైవేటు వైద్యం



ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికీ ఇహెచ్‌ఎస్‌ (ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌) కార్డులు అందకపోవడం పట్ల వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు వైద్యశాలల్లో వైద్యం చేయించుకోవడం శక్తికి మించిన భారంగా మారుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇహెచ్‌ఎస్‌ కోసం గత మూడు నెలలుగా జీతాల నుంచి ప్రీమియం ప్రభుత్వానికి చెల్లిస్తున్నా.. ఇహెచ్‌ఎస్‌ కార్డులు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్టవ్యాప్తంగా సుమారు 95 వేలమంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉండగా, ఒక్కొక్కరు నెలకు రూ.225 చొప్పున మూడు నెలలకు మొత్తం రూ.6.75 కోట్లు ప్రీమియం రూపేణా చెల్లించినట్లు సమాచారం. ఉద్యోగుల డేటాను డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టుకు, ట్రెజరీ నుంచి పంపకపోవడంతో ఉద్యోగుల వివరాలు మ్యాపింగ్‌ కాలేదు. ఫలితంగా ఇహెచ్‌ఎస్‌ లాగిన్‌లో డేటా కనపడని పరిస్థితి నెలకొంది.


90 శాతానికి పైగా పేదవారే..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో 90 శాతానికి పైగా పేద, మధ్యతరగతికి చెందిన వారే ఉద్యోగులుగా ఉన్నారు. పేరుకే ప్రభుత్వ ఉద్యోగులమని, ప్రభుత్వపరంగా మిగిలిన ఉద్యోగుల తరహాలో తమకు అందాల్సిన బెనిఫిట్స్‌ ఏమీ అందడం లేదని వాపోతున్నారు. తెల్ల రేషన్‌ కార్డులు రద్దు చేయడంతో ఆరోగ్యశ్రీ వైద్యం చేయించుకునే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. తమ కుటుంబ సభ్యులకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించడం శక్తికి మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎపిజిఎల్‌ఐ కోసం నెలనెలా ప్రీమియం చెల్లిస్తున్నా.. ఆ సౌకర్యం కూడా అందుబాటులోకి రాలేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగికి ఏదైనా అనుకోని సంఘటన జరిగి మరణించినా బీమా సౌకర్యం, గ్రేడ్‌లు వారీ ప్యాకేజీ, ఉద్యోగి మరణిస్తే వారి అంత్యక్రియల కోసం, మట్టి ఖర్చుల కోసం ప్రభుత్వం ఇచ్చే సహాయం అందే పరిస్థితి కనబడటం లేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఇహెచ్‌ఎస్‌ కార్డులు మంజూరు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

నోబెల్‌ 2022: రసాయన శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్‌ ప్రైజ్‌ను ప్రకటించారు

స్టాక్‌హోమ్‌: రసాయన శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్‌ ప్రైజ్‌ను ప్రకటించారు. అమెరికా శాస్త్రవేత్తలు కరోలిన్‌ బెర్టోజి, బ్యారీ షార్ప్‌లెస్‌తో పాటు డెన్మార్క్‌కు చెందిన మోర్టన్‌ మెల్డల్‌లకు సంయుక్తంగా ప్రైజ్‌ను ప్రకటించింది కమిటీ.

భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో స్టాక్‌హోమ్‌(స్వీడన్‌) రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ మేర ప్రకటన చేసింది. క్లిక్ కెమిస్ట్రీ, బయోఆర్తోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధి కోసం వీళ్లు చేసిన కృషికిగానూ నోబెల్‌ ప్రైజ్‌ను ఇస్తున్నట్లు కమిటీ తెలిపింది.

ఇదిలా ఉంటే.. షార్ప్‌లెస్‌కు ఇది రెండో నోబెల్‌ ప్రైజ్‌. 2001లో ఆయన రసాయన శాస్త్రంలోనే నోబెల్‌ అందుకున్నారు.

BREAKING NEWS:
The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Chemistry to Carolyn R. Bertozzi, Morten Meldal and K. Barry Sharpless “for the development of click chemistry and biorthogonal chemistry.” pic.twitter.com/5tu6aOedy4
— The Nobel Prize (@NobelPrize) October 5, 2022

Anantapur JNTUలో ఎమ్మెస్సీ, ఎంటెక్‌

అనంతపురంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూఏ) - ఎమ్మెస్సీ, ఎంటెక్‌ రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూనివర్సిటీకి చెందిన కాన్‌స్టిట్యుయెంట్‌ కాలేజీల్లో స్పాన్సర్డ్‌ కేటగిరీ సీట్లు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు టీచింగ్‌/ ఇండస్ట్రీ/ ఆర్‌ అండ్‌ డీ సంస్థల్లో కనీసం ఏడాది పనిచేసిన అనుభవం తప్పనిసరి. పనిచేస్తున్న సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ను దరఖాస్తుకు జతచేయాలి. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌/ ఏపీపీజీఈసెట్‌ 2022/ఏపీపీజీసెట్‌ 2022 ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌లు, స్టయిపెండ్‌లు, ఫీ రీయింబర్స్‌మెంట్‌ వర్తించవు.

ఎమ్మెస్సీ స్పెషలైజేషన్‌లు - సీట్లు: జేఎన్‌టీయూఏ - ఓటీపీఆర్‌ఐ (ఆయిల్‌ టెక్నలాజికల్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)లో ఫుడ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ఒక్కోదానిలో ఏడు సీట్లు చొప్పున మొత్తం 14 సీట్లు ఉన్నాయి.

ఎంటెక్‌ స్పెషలైజేషన్‌లు - సీట్లు: అనంతపురంలోని జేఎన్‌టీయూఏ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌, బ్రిడ్జ్‌ అండ్‌ టన్నెల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ పవర్‌ సిస్టమ్స్‌, పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌, రిలయబిలిటీ ఇంజనీరింగ్‌, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌, ఎనర్జీ సిస్టమ్స్‌, అడ్వాన్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ సిస్టమ్స్‌, ఇంటర్నల్‌ కంబక్షన్‌ ఇంజనీరింగ్‌, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డిఫెన్స్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంజనీరింగ్‌, నానో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్‌ అండ్‌ ఫైన్‌ కెమికల్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. డిఫెన్స్‌ టెక్నాలజీ ప్రోగ్రామ్‌నకు డీఆర్‌డీఓ సహకారం అందిస్తుంది.

పులివెందులలోని జేఎన్‌టీయూఏ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రికల్‌ పవర్‌ సిస్టమ్స్‌, క్యాడ్‌/ క్యామ్‌, డిజిటల్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ్క్ష ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో స్పెషలైజేషన్‌కు ఏడు చొప్పున మొత్తం 175 సీట్లు ఉన్నాయి.

అర్హత: ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి బీఎస్సీ(ఫుడ్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ హోం సైన్స్‌)/ బీఎస్సీ ఆనర్స్‌ (ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీలో కెమిస్ట్రీతోపాటు ఫుడ్‌సైన్స్‌/ బోటనీ/ జువాలజీ/ ఫిజిక్స్‌/ బయో కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ/ సెరీకల్చర్‌/ ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ/ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలలో ఏవైనా రెండు సబ్జెక్ట్‌లు చదివినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో ద్వితీయ శ్రేణి మార్కులు ఉండాలి. ఏపీపీజీసెట్‌ 2022లో ర్యాంక్‌ సాధించి ఉండాలి. ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ ఏఎంఐఈటీఈ ఉత్తీర్ణులు; ఎమ్మెస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/అప్లయిడ్‌ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ)/ ఎంసీఏ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ లేదా ఏపీపీజీఈసెట్‌ 2022లో ర్యాంక్‌ సాధించి ఉండాలి.

ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.1000
చివరి తేదీ: అక్టోబరు 14
చిరునామా: డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, జేఎన్‌టీయూఏ, అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌, అనంతపురం
వెబ్‌సైట్‌: www.jntua. ac.in
Tags